సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో దూసుకుపోతోన్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి చెక్ పెట్టేందుకు బీజేపీ యత్నాలు ముమ్మరం చేసింది. నిమిషనిమిషానికి పరిణామాలు మారుతున్నవేళ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హుటాహుటిన బెంగళూరుకు పయనమయ్యారు. కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతిక హక్కు లేదన్న బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప.. అతి పెద్ద పార్టీ అయిన తమకే గవర్నర్ అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో షా రాక ప్రాధాన్యం సంతరించుకుంది. షా వెంట కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా బెంగళూరుకు వస్తున్నారు.
మ్యాజిక్ ఫిగర్ 112కు కేవలం 8 సీట్ల దూరంలో ఉన్న బీజేపీ... ప్రత్యర్థి జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీలికలకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు అవసరమైన వ్యూహరచనతోపాటు అమలును కూడా స్వయంగా పర్యవేక్షించేందుకే బీజేపీ చీఫ్ అమిత్ షా బెంగళూరుకు వస్తున్నట్లు వినికిడి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్ 38, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని జేడీయూ-కాంగ్రెస్ కూటమి కోరుతున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎవరికి అవకాశమిస్తారన్నది కీలకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment