కర్ణాటక గవర్నర్ విజుభాయ్ రుడాభాయ్ వాలా
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠభరితంగా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో చివరికి హంగ్ ఏర్పడింది. ఏ ఒక్క పార్టీ పూర్తిమెజారిటీ సాధించకపోగా, బీజేపీ(104సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్(77), జేడీఎస్(40), ఇతరులు(2) స్థానాలను కైవసం చేసుకున్నారు. గత పరిణామాల నేపథ్యంలో ముందే మేలుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి చక్రంతిప్పే ప్రయత్నం చేసింది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చకచకా వ్యూహాలు అమలుచేసింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. జేడీఎస్ కురువృద్ధుడు దేవేగౌడకు ఫోన్‌చేసి కలిసిపనిచేద్దామని కోరారు. ఇందుకు గౌడ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇరుపార్టీల నేతలు కలిసి మంగళవారం సాయంత్రమే గవర్నర్‌ను కలవనున్నారు.
గవర్నర్ విజుభాయ్ ఏం చేస్తారో?: హంగ్ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనేదానిపై కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. గుజరాత్‌కు చెందిన వజుభాయ్.. బీజేపీ ఎమ్మెల్యేగా బహుకాలం సేవలందించారు. 2014లో కేంద్రం ఆయనను కర్ణాటక గవర్నర్‌గా పంపింది. సాధారణంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం రివాజుగా వస్తున్నప్పటికీ.. ఆ సంఖ్య కంటే ‘కాంగ్రెస్-జేడీఎస్’ కూటమి స్థానాలు ఎక్కువ కావడంతో గవర్నర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, తాము పెద్ద పార్టీగా ఏర్పడిన పక్షంలో.. ఒకవేళ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రకటన చేస్తే ఏమినటే ప్రశ్న ఉత్పన్నంకాకమానదు.
మీడియా సమావేశాలు రద్దు: ఫలితాల ట్రెండ్స్ తొలి దశలో బీజేపీ గెలుస్తోందన్నట్లు రావడంతో ఆ పార్టీ కార్యాలయాల్లో సందడివాతావరణం కనిపించింది. తీరా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడేటప్పటికి సీన్ రివర్స్ అయింది. దీంతో మీడియా సమావేశం నిర్వహించాలనుకున్న బీజేపీ పెద్దలు.. అనూహ్యంగా దానిని రద్దుచేసుకున్నారు. ఫలితాలపై స్పందించేందుకు కాంగ్రెస్ కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించాలనుకుంది. కానీ పొత్తుకు జేడీఎస్ అంగీకరించడంతో చివరినిమిషంలో ప్రెస్‌మీట్ రద్దుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment