సాక్షి, బెంగళూరు: ఒకవైపు అతిపెద్ద పార్టీ.. రెండోవైపు అత్యధికమంది సభ్యులున్న కూటమి.. నిర్ణయాధికారి గవర్నర్ కోర్టులో బంతి! ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ రాజ్‌భవన్ తలుపుతట్టిన ఇరు పక్షాలతోనూ కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా సాదరంగా ఆహ్వానించారు. నాయకులు చెప్పిన విషయాలను సావధానంగా ఆలకించారు. అయితే, అవకాశం ఎవరికి కలిపించాలనేదానిపై మాత్రం ఎటూతేల్చలేదు. ఉత్కంఠ నడుమ‘‘రెండు రోజుల్లోనే గవర్నర్ సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తారు..’’ అని రాజ్‌భవన్ వర్గాల నుంచి సమాచారం అందింది.
జోరుగా క్యాంప్ రాజకీయాలు: ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ ఆహ్వానించని గవర్నర్... అందుకు రెండు రోజుల గడువు కోరడంతో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 112కు కేవలం 8 సీట్ల దూరంలో ఉన్న బీజేపీ... ప్రత్యర్థి జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీకలకు భారీ ప్రయత్నాలు సాగిస్తున్నది. దీంతో అప్రమత్తమైన కుమారస్వామి.. తన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించే పనిలో పడ్డారు. ఇటు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(104) అతిపెద్ద పార్టీగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లోని కాంగ్రెస్(78), జేడీఎస్(38)లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఈ కూటమికే మద్దతుపలుకుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment