కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బల పరీక్ష పూర్తి కాకముందే ఓ ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్ చేశారు. దీంతో అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 225కి పెరగ్గా.. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
‘కర్ణాటక అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను గవర్నర్ వజుభాయ్ వాలా నామినేట్ చేశారు. కానీ, బీజేపీ అభ్యర్థి యెడ్యూరప్ప ఇంకా బలాన్ని నిరూపించుకోలేదు. అంతలోనే గవర్నర్ ఇలా ఎమ్మెల్యేని నామినేట్ చేయటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి బల పరీక్ష పూర్తయ్యేదాకా అది చెల్లకుండా ఆదేశాలివ్వండి’ అంటూ సంయుక్త పిటిషన్‌లో కాంగ్రెస్-జేడీఎస్‌లు విజ్ఞప్తి చేశాయి.
ఇదిలా ఉంటే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో గత రాత్రి వాదనలు జరిగాయి. పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామన్న బెంచ్.. యెడ్డీ ప్రమాణ స్వీకారంపై స్టే విధించలేమని, గవర్నర్ విచక్షణ అధికారాలను ప్రశ్నించలేమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను శుక్రవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను.. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ నామినేట్ పిటిషన్‌తో కలిపి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment