కుమారస్వామి
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన తరహాలో కర్ణాటకలోనూ బీజేపీ పాచిక పారేలా కనిపిస్తోంది. కులాల ప్రాతిపదికగా ఎమ్మెల్యేలకు ఎర చూపుతూ బీజేపీ లింగాయత్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ దూకుడు పెంచడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మధ్య సఖ్యత కొరవడుతున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు డుమ్మా కొట్టడంతో జేడీఎస్ నేత, కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి సీరియస్‌గా ఉన్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్‌లో కర్ణాటక సీఎల్పీ సమావేశం తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడిన ఆయన తీవ్ర అసంతృప్తితో హోటల్ నుంచి నోవాటెల్‌కు వెళ్లిపోయారు. మీ ఎమ్మెల్యేలను మీరే కాపాడుకోలేక పోతున్నారంటూ పెదవి విరిచారు. జాగ్రత్తగా ఉంటే మంచిదంటూ మాజీ సీఎం సిద్దరామయ్య, పరమేశ్వరలకు సూచించారు. నోవాటెల్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలతో కుమారస్వామి భేటీ కానున్నారు.
చుక్కలు చూపిస్తోన్న 8 మంది ఎమ్మెల్యేలు
కాంగ్రెస్‌లోని 8 మంది లింగాయత్ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించేయత్నం చేయడం కారణంగా.. తాజ్‌కృష్ణలో జరిగిన సీఎల్పీ భేటీలో వీరి నుంచి సమావేశంలో వ్యతిరేకత వచ్చింది. మరోవైపు సీఎల్పీ భేటీకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం గమనార్హం. వీరిలో రాయచూర్ జిల్లా మక్కి ఎమ్మెల్యే ప్రతాఫ్ గౌడ, బళ్లారి జిల్లా హోస్‌పేట్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఉన్నారు. దీంతో బీజేపీ తమ నేతలను ప్రలోభాలకు గురిచేసిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇతర నేతలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment