
ముంబై : దక్షిణాది రాష్ట్రంలో అత్యంత కీలక రాష్ట్రమైన కర్ణాటక ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. తొలుత బీజేపీ మేజిక్ మార్కు దిశగా దూసుకుపోతున్న తరుణంలో మార్కెట్లు ర్యాలీని కొనసాగించగా.. చివరికి జేడీ(ఎస్), కాంగ్రెస్ కలిసి పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకునే సరికి మార్కెట్లు ఢమాల్‌మన్నాయి. మధ్యాహ్నం సమయానికి వచ్చే సరికి కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు మారడంతో, మార్కెట్లలో కూడా అమ్మకాలు చోటు చేసుకుని, తమ లాభాలన్నింటిన్నీ కోల్పోయాయి. సెన్సెక్స్ మధ్యాహ్న ట్రేడింగ్‌లో దాదాపు 400 పాయింట్ల మేర లాభాలను పోగొట్టుకుంది. సెన్సెక్స్ చివరికి 13 పాయింట్ల నష్టంలో 35,543 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంలో 10,801 వద్ద ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఇంట్రాడే హైగా 35,993.53 మార్కును తాకింది.
బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజార్టీకి కాస్త దూరంలోనే ఆగిపోయింది. దీంతో జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తీవ్ర అప్రమత్తతో వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆరంభ లాభాలను పూర్తిగా కోల్పోయిన స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ సైతం 179 పాయింట్లు డౌన్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా భారీగా రూ.13,417 కోట్ల మేర క్యూ 4 నష్టాలను ప్రకటించగా.. ఈ బ్యాంకు షేర్ కూడా 6 శాతానికి పైగా క్షీణించింది. లుపిన్ షేర్ కూడా ఫలితాల ప్రకటనతో కిందకి పడిపోయింది. కర్ణాటక బ్యాంకు, జెట్ ఎయిర్‌వేస్, దేనా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, పీటీసీ ఇండియా ఫైనాన్సియల్ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్, ఇండియాబుల్స్ రియల్, ఎన్‌సీసీ, బాలాజి టెలిఫిల్మ్స్, బజాజ్ హిందూస్తాన్, కేఈసీ ఇంటర్నేషనల్, జేకే పేపర్, టాటా గ్లోబల్ బెవరేజస్‌లు కూడా 10 శాతం మేర డౌన్ అయ్యాయి. కర్ణాటక రాజకీయ సమీకరణాలు రూపాయిపై కూడా ప్రభావం చూపాయి. ఫ్లాట్‌గా ట్రేడైన డాలర్‌తో రూపాయి మారకం విలువ మధ్నాహ్నం ట్రేడింగ్‌కు వచ్చేసరికి 37 పైసలు డౌన్ అయింది. చివరికి 38 పైసల నష్టంలో 67.89 గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment