ముంబై : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న వాడివేడి రాజకీయాలు, ముడి చమురు ధరలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు పతనమయ్యాయి. మరోవైపు రూపాయి క్షీణత కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. వీటన్నింటి ప్రభావంతో నేడు(శుక్రవారం) సెన్సెక్స్ 301 పాయింట్ల మేర కుప్పకూలింది. 301 పాయింట్ల దిగజారిన సెన్సెక్స్ చివరికి 34,848 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 86 పాయింట్ల నష్టంలో 10,600కు దిగువన 10,596 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్‌లో ఎల్ అండ్ టీ, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, గ్రాసిమ్‌లు టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. అటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్, ఐటీసీ, కొటక్ మహింద్రా బ్యాంకులు టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ సైతం 250 పాయింట్లు కిందకి పడిపోయింది.
అమర రాజా బ్యాటరీస్, ఎస్‌ఆర్‌ఎఫ్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, నాల్కో, గ్రాఫైట్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్, ఎస్కార్ట్స్, జ్యోతి ల్యాబ్స్‌లు దాదాపు 13 శాతం వరకు క్షీణించాయి. ఇప్పటికే మండుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు వచ్చే నెలల్లో మరింత పెరుగనున్నాయని గోల్డ్‌మ్యాన్ శాచ్స్ రిపోర్టు వెల్లడించడంతో, మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుల దేశీయ కరెంట్ అకౌంట్ లోటుకు ప్రమాదకరమని ఈ గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసు దిగ్గజం వెల్లడించింది. మరోవైపు కర్ణాటక రాజకీయ పరిస్థితులు వాడివేడిగా మారుతున్నాయి. శనివారం ఫ్లోర్ టెస్ట్ ఖాయం కావడంతో మార్కెట్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రారంభం నుంచి నష్టాలు పాలవుతూ వచ్చిన మార్కెట్లు మధ్యాహ్నం ట్రేడింగ్‌కు వచ్చేసరికి ఆ నష్టాలను మరింత పెంచుకున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీగా క్రాష్ అయింది. 34 పైసలు బలహీనపడి 68.04 వద్ద నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment