బెంగుళూరు : దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన కర్ణాటక ఎన్నిలు ముగిశాయి. అయితే ఫలితాలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్ ఫిగర్ 112’ను మాత్రం చేరుకోలేకపోయింది. దాంతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అంశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రెకెత్తించడమే కాకుండా కన్నడ ప్రజలకు మరోసారి 2008 నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది.
‘ఆపరేషన్ లోటస్’
2008లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే అప్పుడు కూడా సరిగ్గా ఇప్పటిలాంటి పరిస్థితే ఎదుర్కొంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్ ఫిగర్’కు మూడు సీట్లు తక్కువ పొందింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు డబ్బు, పదవి ప్రలోభాలు చూపించి తమవైపు తిప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, జేడీఎస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మేల్యేల మద్దతుతో బీఎస్ యడ్యూరప్ప నాయకత్వంలో దక్షిణాదిలో తొలిసారిగా కాషాయ ప్రభుత్వం కొలువుతీరింది.
పదవి కాంక్షతో బీజేపీ అవలంభించిన ఈ విధానాన్ని ప్రతిపక్ష పార్టీలు ‘ఆపరేషన్ లోటస్’గా నామకరణం చేసి, బీజేపీ పార్టీ చర్యలను తప్పు పట్టడమే కాక ఇలా చేయడం విలువలకు విరుద్ధమని విమర్శించాయి. అయితే అప్పుడు కూడా యడ్యూరప్ప ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం గమనార్హం. ఇదిలావుంటే యడ్యూరప్ప 2013లో బీజేపీ నుంచి బయటకు వచ్చి కర్ణాటక జనతా పక్ష (కేజేపీ) పేరుతో పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యడ్యూరప్ప ‘ఆపరేషన్ లోటస్’పై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అప్పట్లో అసెంబ్లీలో బీజేపీ బలాన్ని పెంచడానికి తాను ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్టు వెల్లడించారు.
2018 పరిస్థితి..
ఇప్పుడు(2018లో) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2008 నాటి పరిస్థితులే తలెత్తాయి. ఇప్పడు కూడా బీజేపీ, కాంగ్రెకస్, జేడీఎస్‌లు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ 104 సీట్లు సాధించి సింగిల్ మెజారిటీ పార్టీగా నిలిచినప్పటికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్ ఫిగర్ 112’ను చేరుకోలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో మరోసారి ‘ఆపరేషన్ లోటస్’కు బీజేపీ తెర తీసిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment