బీఎస్ యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీలో బల నిరూపణకు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా 15 రోజులు గడువు ఇవ్వడంపై సీఎం బీఎస్ యడ్యూరప్ప స్పందించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడోసారి బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం బీజేపీ నేతలతో సమావేశం సందర్భంగా యెడ్డీ మాట్లాడుతూ.. బల నిరూపణకు 15 రోజులు మనకు అక్కర్లేదని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా మెజార్టీ సంఖ్యా బలం ఉందని మనం చూపించాలి. కన్నడ ప్రజలు బీజేపీకి పట్టంకడుతూ తీర్పిచ్చారని గుర్తు చేశారు. దీన్ని బట్టి బీజేపీపై వారికున్న విశ్వాసం మరోసారి రుజువైందన్నారు.
బెంగళూరులో బీజేపీ నేతలను ఉద్దేశించి యడ్యూరప్ప మాట్లాడుతూ.. మేం కాంగ్రెస్-జేడీఎస్‌లను, వాళ్లు బీజేపీని నిందించుకోవడం కంటే ప్రజల తీర్పును శిరసావహించడం ఉత్తమం. ఇప్పటికే వారు ఎన్నికల్లో మాకే ఎక్కువ సీట్లు అందించారు. ఎన్నికల సందర్భంగా వారికిచ్చిన హామీలను నెరవేర్చేందుకు మనం కృషి చేయాలి. బీజేపీకి పెద్ద బాధ్యతను రాష్ట్ర ప్రజలు అప్పగించారు. అందుకే మనం సాధ్యమైనంత త్వరగా బలాన్ని నిరూపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ’ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ చేస్తున్న బ్యాక్ డోర్ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారని అనంత్ కుమార్ చెప్పారు.
కాగా, 222 స్థానాలకు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు నెగ్గి మెజార్టీకి 8 సీట్ల దూరంలో నిలిచింది. కాగా, కాంగ్రెస్ 78 స్థానాలు, జేడీఎస్ 38 స్థానాలు గెలుపొందాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిగా ఏర్పడి హెచ్‌డీ కుమారస్వామిని సీఎం చేయాలని చూశాయి. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి గవర్నర్ అవకాశం ఇచ్చి యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment