సాక్షి, న్యూఢిల్లీ: బలపరీక్షకు కొన్ని క్షణాల ముందు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన యడ్యూరప్ప అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటివరకు తాము బలపరీక్షలో గెలిచితీరుతామని, 101శాతం విజయం తమదేనని పదేపదే చెప్పిన యడ్యూరప్ప.. అసెంబ్లీలో మాత్రం విశ్వాస పరీక్షను ఎదుర్కోలేదు. తమకు తగినంత సంఖ్యాబలం లేదని స్పష్టం చేశారు. నిజానికి ఇది ఆకస్మిక ప్రకటనేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి. యడ్యూరప్ప చివరినిమిషంలో చేసిన ఈ ప్రకటన అటు కాంగ్రెస్-జేడీఎస్ వర్గాలనే కాదు.. ఇటు బీజేపీ శ్రేణులను విస్మయ పరిచింది.
అందుకు కారణం లేకపోలేదు.. చివరిక్షణం వరకు బీజేపీ నేతలు బలపరీక్షలో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టాన దూతగా కర్ణాటకకు వచ్చిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సైతం తమదే గెలుపు అంటూ నొక్కి వక్కాణించారు. ఈ క్రమంలో కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి.. తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ బేరసారాలను ముమ్మరం చేసిందని కథనాలు వచ్చాయి. బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆడియో టేపులు వెలుగుచూశాయి. అటు కాంగ్రెస్-జేడీఎస్ కూడా అప్రమత్తమై.. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరిని బీజేపీ నేతలు బంధించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
ఈ పరిణామాల నడుమే బీజేపీ అధిష్టానం వ్యూహం మారినట్టు కనిపిస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అసెంబ్లీకి రావడానికి ముందు యడ్యూరప్ప బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు జవదేకర్, జేపీ నడ్డా, అనంతకుమార్, సదానంద గౌడ, పార్టీ నేతలు శ్రీరాములు, జగదీశ్ షెట్టర్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ తర్వాత గవర్నర్ వజుభాయ్ వాలాను కలిశారు. అనంతరం అసెంబ్లీకి వచ్చిన యడ్యూరప్ప భావోద్వేగంగా ప్రసంగించి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ అధినాయకత్వం యడ్యూరప్పకు తెలిపినట్టు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష గురించి యావత్ దేశం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూడటం.. కర్ణాటక రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్న నేపథ్యంలో విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే తప్పుకోవడం మంచిదనే నిర్ణయానికి బీజేపీ అధినాయకత్వం వచ్చినట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బేరసారాలు నెరిపి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందనే మచ్చ పార్టీకి రాకూడదనే ఉద్దేశంతోనే యెడ్డీని హుందాగా దిగిపొమ్మని బీజేపీ అధిష్టానం సూచించిందని ఆ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుకు అధిష్టానం ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరోవైపు గవర్నర్ ఇచ్చినవిధంగా బలపరీక్షకు 15రోజులు గడువు ఉండివుంటే అలవకోగా యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గేవారని, కానీ సుప్రీంకోర్టు 24 గంటల గడువు (శనివారం 4 గంటలలోపు) ఇవ్వడంతో విశ్వాస పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని ఆ పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు.. ఆ తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలపై బీజేపీ నేతలు ఇప్పుడు దృష్టిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment