సాక్షి, బెంగళూరు: బలపరీక్షకు ముందే బీఎస్ యడ్యూరప్ప రాజీనామా నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా జేడీఎస్ నేత కుమారస్వామి చకచకా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఆయన.. తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా నేతలను స్వయంగా ఆహ్వానించబోతున్నారు. ఇందులో భాగంగా కుమారస్వామి సోమవారం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని కుమారస్వామి ఆదివారం మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 24 గంటల్లో బలనిరూపణ చేసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ‘అవును, రేపు నేను ఢిల్లీకి వెళ్లబోతున్నాను. ఢిల్లీలో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీని కలుస్తాను. ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోగా బలనిరూపణ చేసుకుంటాను’ అని ఆయన చెప్పారు.
విశ్వాస పరీక్షకుముందే యడ్యూరప్ప రాజీనామా చేయడంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. యడ్యూరప్ప రాజీనామా చేసిన వెంటనే గవర్నర్ ఆహ్వానం మేరకు జేడీఎస్-కాంగ్రెస్ నేతలు ఆయనను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కొలువుదీరనుంది. ప్రస్తుతం సంకీర్ణ సర్కారు మంత్రిమండలి కూర్పు ఈ విధంగా ఉండాలి, ఇరు పార్టీల నేతలకు ఎంతమేరకు ప్రాధాన్యమివ్వాలని ఇరుపార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment