గవర్నర్‌కు రాజీనామా సమర్పిస్తున్న యడ్యూరప్ప..
సాక్షి, బెంగళూరు : ముందుగా ఊహాగానాలు వెలువడినట్టే.. బలపరీక్షకు ముందు బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. వారం రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగుతూ.. క్షణక్షణానికి అనూహ్య మలుపులు తిరుగుతున్న కన్నడ రాజకీయ కథకు తెరదించారు. నాటకీయ పరిణామాల నడము తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ.. ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటున్నట్టు యడ్యూరప్ప ప్రకటించారు. అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వజుభాయ్ వాలాకు రాజీనామా సమర్పించారు. దీంతో కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. యడ్యూరప్ప రాజీనామాతో ప్రజాస్వామ్యం విజయం సాధించిందంటూ కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అసెంబ్లీలో జేడీఎస్ నేత కుమారస్వామి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పరస్పరం చేతులు పట్టుకొని సంఘీభావం తెలుపుతూ.. హర్షధ్వానాలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీ తమకు ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు.
ముందుగానే ఊహించిందే!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 104 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 222 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 112. కానీ జేడీఎస్ నేత కుమారస్వామి రెండుచోట్ల ఎమ్మెల్యేగా గెలుపొందినా.. ఆయనకు ఒకే ఓటు హక్కు ఉండటంతో మ్యాజిక్ ఫిగర్ 111కు చేరింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఏడుగురు ఎమ్మెల్యలేను తనవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా బేరసారాలు సాగించినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీ నేతలు యడ్యూరప్ప, శ్రీరాములు తదితరులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఫోన్‌లో బేరసారాలు జరిపారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆడియో టేపులను విడుదల చేసింది. ఒక స్వతంత్రఎమ్మెల్యేను బీజేపీ తనవైపు తిప్పుకున్నప్పటికీ మిగతా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించలేకపోయిందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. అటు కాంగ్రెస్-జేడీఎస్ అగ్రనేతలు కూడా మొదటి నుంచి తమ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడకుండా, ప్రలోభాలకు లోనవ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలను రిస్టార్ట్‌లకు తరలించి.. క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. చివరకు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్‌కు తరలించి.. చివరిక్షణంలో వారిని బెంగళూరు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ నడిపించిన రిసార్ట్ క్యాంపులు ఫలించినట్టు కనిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా.. ఆ యత్నాలు సఫలం కాలేదన్న విషయం శనివారం మధ్యాహ్నం నాటికి స్పష్టమైపోయింది. దీంతో బీజేపీకి అంతకుముందు ఓటేస్తామన్న ఇద్దరు ‘మిస్సింగ్’ ఎమ్మెల్యేలు సైతం తిరిగి ప్రత్యక్షమై కాంగ్రెస్ క్యాంప్‌నకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నంనాటికే బీజేపీ శాసనసభా పక్ష నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం ఊపందుకుంది. బలపరీక్షకు తగిన మెజారిటీ లేకపోవడంతో గతంలో వాజ్‌పేయి కూడా విశ్వాస పరీక్షకు ముందే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా అదే దారిలో సాగుతూ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు బీజేపీ వర్గాల్లో తీవ్రమయ్యాయి. ఈ ఊహాగానాలు నిజం చేస్తూ.. మధ్యాహ్నం 3.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే.. ఉద్వేగభరితంగా యడ్యూరప్ప ప్రసంగిస్తూ.. బీజేపీకి ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమకు 104 సీట్లు మాత్రమే ఇచ్చారని, పూర్తి మెజారిటీ ఇచ్చి ఉంటే.. కర్ణాటకను స్వర్గధామంగా చేసి ఉండేవాడినని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌లను ప్రజలు తిరస్కరించినా.. ఆ పార్టీలు అనైతిక పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాజీనామా చేయడంతో ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న బలపరీక్ష మొదలుకాకముందే.. టెన్షన్‌కు తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment