శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న పాతకాలం నాటి సామెతను ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ మరోసారి రుజువు చేశాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న నానుడిని నిజం చేశాయి. ఎన్నికల ప్రచారంలో, ఎన్నికలకు ముందు ఉప్పు,నిప్పు మాదిరిగా కలబడిన పార్టీలు మారిన పరిస్థితుల్లో ఒక్కసారిగా స్నేహగీతాన్ని ఆలపించాయి. మళ్లీ సంకీర్ణ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాయి. జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ సర్కార్‌ను నడిపించిన అనుభవం కాంగ్రెస్, బీజేపీలకుంది. రెండు సందర్భాల్లోనూ ఈ పార్టీలకు జూనియర్ భాగస్వామిగా ఉన్న జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాల నుంచి వైదొలిగింది.
–2004 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ సీట్లు దక్కలేదు. బీజేపీకి 80 సీట్లు, కాంగ్రెస్‌కు 65, జేడీఎస్‌కు 58 సీట్లు వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో ధరమ్‌సింగ్ సీఎంగా కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి జేడీఎస్ నేతగా ఉన్న సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. అయితే ఈ సర్కార్ పాలన మొదటి నుంచే సజావుగా సాగలేదు. వొక్కళిగల నాయకుడు డీకే శివకుమార్‌తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మంత్రిపదవులు ఇవ్వొద్దంటూ జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవగౌడ పట్టినపట్టుకు కాంగ్రెస్ తలొగ్గక తప్పలేదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం సిద్ధరామయ్య చేపట్టిన ‘అహిందా ర్యాలీ’లను దేవగౌడ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీని లేదా అహిందాలలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలంటూ సిద్దూకు షరతు పెట్టారు. ఈ ఒత్తిళ్లకు సిద్ధరామయ్య తలొగ్గలేదు. దీంతో ఆయనను జేడీఎస్ నుంచి బహిష్కరించారు. సిద్ధరామయ్య స్థానంలో లింగాయత్‌ల నాయకుడు ఎంపీ ప్రకాష్‌ను డిప్యూటీసీఎం చేశారు. ఈ పరిస్థితిని మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న హేచ్‌డీ కుమారస్వామి తనకు అనుకూలంగా మలుచుకున్నారు.
జేడీఎస్‌లోని మెజారిటీ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని చూరగొనే చర్యలు చేపట్టారు. అంతా సవ్యంగానే ఉందని అనుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. తమ పార్టీని చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపిస్తూ జేడీఎస్ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ పంచన చేరారు. దీంతో ధరమ్‌సింగ్ ప్రభుత్వం కూలిపోక తప్పలేదు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన దేవగౌడ తన కొడుకు కుమారస్వామిని పార్టీ నుంచి బహిష్కరించారు. సత్వర నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జేడీఎస్‌కు చెందిన మూడింట రెండువంతుల ఎమ్మెల్యేల మద్దతు కారణంగా కుమారస్వామి వర్గాన్నే నిజమైన జేడీఎస్‌గా స్పీకర్ గుర్తించారు.
2006లో బీజేపీ–జేడీఎస్‌ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ రెండుపార్టీలు చెరి 20 నెలలు అధికారాన్ని పంచుకోవాలనేది దీని సారాంశం. మొదట కుమారస్వామి సీఎం పదవిని చేపట్టగా బీఎస్ యడ్యూరప్ప డిప్యూటీ సీఎం అయ్యారు. సీఎంగా కుమారస్వామి చేపట్టిన ‘పల్లెనిద్ర’ కార్యక్రమం ఆయనను గ్రామీణ ప్రజానీకానికి చేరువ చేసింది. ఈ క్రమంలో కొడుకు పట్ల దేవగౌడ మెత్తబడ్డారు. మంచిపాలన అందిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. బళ్లారి గనుల వ్యాపారుల నుంచి రూ. 150 కోట్లు లంచం తీసుకున్నారంటూ సీఎం కుమారస్వామిపై ఎమ్మెల్సీ గాలి జనార్దనరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ తర్వాత ఇవి తెరవెనక్కు వెళ్లిపోయాయి. ఇరవై నెలల సీఎం పదవీకాలం కుమారస్వామి పూర్తిచేసుకున్నాక అధికారమార్పిడి సందర్భంగా సమస్యలు తలెత్తాయి.
బీజేపీకి అధికారాన్ని అప్పగించడంపై పార్టీలో వ్యతిరేకత పెరిగింది. కొద్దిరోజులు ఇదే పరిస్థితి కొనసాగడంతో గవర్నర్ శాసనసభను 33 రోజుల పాటు ‘సుప్త చేతనావస్థ’ (సస్పెండెడ్ యానిమేషన్)లో ఉంచారు. ఈ నేపథ్యంలో బీజేపీకి అధికారాన్ని అప్పగిస్తానంటూ కుమారస్వామి ప్రకటించారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లిన యడ్యూరప్ప హుటాహుటిన బెంగళూరుకు తిరిగొచ్చి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే బలనిరూపణ సందర్భంగా జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఓటేయలేదు. దీంతో కేవలం ఏడురోజుల్లోనే సీఎంగా యడ్యూరప్ప మొదటి దఫా పాలన ముగిసింది. ఆ తర్వాత ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాక ఆ అసెంబ్లీని రద్దుచేశారు. 2008 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించడంతో యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment