సాక్షి, బెంగళూరు : బీజేపీకి సాధారణ మెజారిటీ లేకపోయినప్పటికీ.. ఆ పార్టీ నేత యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడంపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. బీజేపీపై పోరాటానికి సీనియర్ రాజకీయ నేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను రంగంలోకి దింపుతున్నాయి. ఇదే విషయాన్ని జేడీఎస్ నేత, దేవెగౌడ తనయుడు కుమారస్వామి వెల్లడించారు. ‘ఈ పోరాటానికి నాయకత్వం వహించి.. అన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడాల్సిందిగా మా నాన్న (హెచ్‌డీ దేవెగౌడ)ను కోరుతాను. బీజేపీ ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును ఆయన అందరి దృష్టికి తీసుకెళతారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మనమంతా కలిసి సాగాల్సిన అవసరముంది’ అని కుమారస్వామి గురువారం విలేకరులతో అన్నారు.
బీజేపీ సాధారణ మెజారిటీ సాధించినప్పటికీ.. యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చి.. గవర్నర్ వజుభాయ్ వాలా అసంబద్ధంగా ప్రవర్తించారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని జేడీఎస్ నేత కుమారస్వామి మండిపడ్డారు. బీజేపీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తమ తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు. ‘మా ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనే ప్రస్తుతం మేం దృష్టిపెట్టాం. బీజేపీ, ఆ పార్టీ మంత్రులు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో ప్రజలు గమనించాలి. బీజేపీకి మెజారిటీ లేదు. అయినా గవర్నర్ ఇలా ఎందుకు ప్రవర్తించారు? ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు’ అని కుమారస్వామి అన్నారు.
సీఎంగా యడ్యూరప్ప ప్రమాణాన్ని వ్యతిరేకిస్తూ.. కర్ణాటక విధానసౌధ ఎదుట కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనలో జేడీఎస్ కురువృద్ధ నేత దేవెగౌడ కూడా పాల్గొన్నారు. బీజేపీ విధానాలను నిరసిస్తూ ఆయన నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు.
Comments
Please login to add a commentAdd a comment