వందకోట్లు.. మంత్రి పదవి.. సంచలన వ్యాఖ్యలు | HD Kumaraswamy chosen as JDS legislative party leader | Sakshi
Sakshi News home page

May 16 2018 12:36 PM | Updated on May 16 2018 5:56 PM

HD Kumaraswamy chosen as JDS legislative party leader  - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో సాగుతున్న ప్రలోభాల పర్వంపై జేడీఎస్‌ అధినేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 100 కోట్లు, కేబినెట్‌ మంత్రి పదవి ఆఫర్‌ చేస్తుందని ఆయన తెలిపారు. బుధవారం బెంగళూరులోని ఓ హోటల్‌లో జరిగిన జేడీఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘ఆపరేషన్‌ కమల్‌’  విజయవంతమైందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. బీజేపీ తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను లాక్కుంటే.. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కుంటామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు తెరతీసేలా గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సూచించారు. ఉత్తరాదిలో విజయవంతంగా సాగిన బీజేపీ అశ్వమేధ యాగానికి కర్ణాటకలో ఫుల్‌స్టాప్‌ పడిందని, కర్ణాటక ఫలితాలు బీజేపీ అశ్వమేధ యాగాన్ని అడ్డుకున్నాయని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. జేడీఎస్‌లో చీలిక వస్తుందని తప్పుడు ప్రచారం చేశారని, తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రచారం వల్ల బీజేపీకి 104 స్థానాలు రాలేదని, సెక్యూలర్‌ ఓట్లు చీలడం వల్లే ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చాయని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మోదీ, బీజేపీ గెలుపు కాదని అన్నారు. బీజేపీ అధికారం కోసం వెంపర్లాడుతోందని, ప్రధాని మోదీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆయన స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీని చీల్చాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. అధికార బలంతో ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని, ఐటీ దాడులు చేయిస్తూ.. వారిని ఆందోళనకు గురిచేయాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు.

మరికాసేపట్లో ఆయన రాష్ట్ర గవర్నర్‌ను కలువనున్నారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయనకు ఇచ్చి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు. బీజేపీతో టచ్‌లో ఉన్నారని భావిస్తున్న దేవెగౌడ కొడుకు రేవణ్ణ కూడా జేడీఎస్‌ శాసనసభాపక్ష భేటీలో పాల్గొనడం గమనార్హం. జేడీఎస్‌లో ఎలాంటి చీలిక లేదని, పార్టీ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నామని రేవణ్ణ తెలిపారు. ఇక ఈ భేటీకి ఇద్దరు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు మాత్రం హాజరుకాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement