మీడియాతో ప్రకాష్ జవదేకర్
సాక్షి, బెంగళూరు: వంద కోట్ల రూపాయలు అంటేనే ఊహించుకోవడం కష్టమని, అలాంటి నోట్ల రాజకీయాలు ఎవరు చేస్తున్నారో కర్ణాటకలో అందరికీ తెలుసునని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ నోట్ల కట్టలతో జేడీఎస్ నేతలను కొనాలని, మంత్రి పదవులంటూ వారిని ప్రలోభపెట్టాలని చూస్తోందంటూ కుమారస్వామి చేసిన ఆరోపణలపై జవదేకర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంద కోట్ల నగదు అంటే భారీ మొత్తమని, అయినా నగదుతో నేతలను మభ్యపెట్టడం కాంగ్రెస్-జేడీఎస్‌కు బాగా తెలుసునని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు మేం విజ్ఞప్తి చేశాం. బీజేపీ ఎన్నటికీ నియమాలను ఉల్లంఘించదు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మేం ఇప్పటికీ విశ్వసిస్తున్నాం. మరోవైపు ప్రత్యర్థి కూటమి బీజేపీపై బురద చల్లే యత్నం చేస్తోంది. వ్యాపారం చేసినట్లుగా.. నేతలను కొనడం కాంగ్రెస్‌కు బాగా తెలుసు. జేడీఎస్‌తో కూటమిపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. న్యాయమార్గాన్ని అనుసరించి గవర్నర్ అనుమతితో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని’ ప్రకాష్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వాన్ని బీజేపీనా, లేక కాంగ్రెస్-జేడీఎస్‌లు ఏర్పాటు చేస్తాయా అన్న దానిపై దక్షిణాది రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రలోభాల పర్వాన్ని బీజేపీ కొనసాగిస్తుందని కాంగ్రెస్- జేడీఎస్ కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి నేడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 100 కోట్లు, మంత్రి పదవులు ఆఫర్ చేస్తుందని ఆరోపించారు. ‘ఆపరేషన్ కమల్’ విజయవంతమైందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమ కూటమితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. బీజేపీ తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను లాక్కుంటే.. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment