
రాజ్‌భవన్‌కు బస్సులో వచ్చిన ఎమ్మెల్యేలు
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమను అనుమతించకపోతే ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సిద్ధమైంది. తమ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో జేడీఎస్ నేత కుమారస్వామి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అయితే సిబ్బంది ఆ నేతలను రాజ్‌భవన్‌లోకి అనుమతించలేదు. దీంతో కుమారస్వామి, పరమేశ్వర, ఎమ్మెల్యేలు గేటు బయటే ఉండిపోయారు. దీంతో రాజ్‌భవన్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కలిసి కుమారస్వామి, పరమేశ్వర ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. అనంతరం యడ్యూరప్ప కూడా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది.
కాగా, గవర్నర్ వజుభాయ్ ఎదుట పరేడ్ నిర్వహించాలని రెండు పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోరుతూ కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. తమకు మద్దతుందని, కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ వజుభాయ్‌ని కోరనున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కుమారస్వామని అనుమతించకపోతే గవర్నర్‌కు వ్యతిరేకంగా ధర్నా చేయాలని ఈ కూటమి యోచిస్తోంది. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హక్కుందని, ఈ నేపథ్యంలో గవర్నర్ తమవైపు మొగ్గు చూపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం ఉంటే.. అవసరమైతే న్యాయం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్-జేడీఎస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.