సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరు బలపరీక్షలో నెగ్గుతారు? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇటు యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ, అటు కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్ వాలా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి ఆయన మొదట అవకాశం ఇస్తారా? లేక పూర్తి మెజారిటీ తమకు ఉందని చెప్తున్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి చాన్స్ ఇస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై.. యడ్యూరప్పను నాయకుడిగా ఎన్నుకుంది. యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను మరోసారి కలిసి.. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ సొంతంగా 104 స్థానాలు గెలుచుకుంది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సంఖ్యాబలం 105కు చేరుకుంది.
అటు, జేడీఎస్ శాసనసభాపక్షం కూడా భేటీ అయి.. కుమారస్వామిని నాయకుడిగా ఎన్నుకుంది. కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ నేతలు బుధవారం సాయంత్రంలోగా గవర్నర్‌ను కలువనున్నారు. తమకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో లేఖను గవర్నర్‌కు అందజేసి.. మొదట తమకు అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై.. జీ పరమేశ్వరను నాయకుడిగా ఎన్నుకుంది. జేడీఎస్‌కు మద్దతుగా నిలువాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో ఇటు బీజేపీకిగానీ, అటు జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం ఉందా? అన్నది ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీలోని 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 112. బీజేపీకి ఇప్పటివరకు అధికారికంగా 105మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్ కూడా ఉన్నారు. ఆయన కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ) పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు కాంగ్రెస్ 78 స్థానాలు, జేడీఎస్ 38 స్థానాలు గెలుపొందాయి. మరో స్వతంత్ర ఎమ్మెల్యే ప్రస్తుతానికి వైఖరి తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులను కలుపుకుంటే.. ఆ కూటమి బలం 116కు చేరుకుంటుంది. అలవోకగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటవచ్చు. బలపరీక్షలోనూ కుమారస్వామి కూటమి గెలువవచ్చు. కానీ అసలు తిరకాసు ఇక్కడే ఉంది. బీజేపీ బేరసారాలకు పలువురు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆకర్షితమైనట్టు తెలుస్తోంది. వీరు లోపాయికారిగా బీజేపీ అనుకూలంగా పనిచేస్తారని, బీజేపీ బలపరీక్ష ఎదుర్కొంటే.. గైర్హాజరై.. ఆ పార్టీకి పరోక్షంగా సహకరిస్తారని అంటున్నారు.
ఇప్పటివరకు పరిణామాలనుబట్టి చూస్తే.. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. వారు బీజేపీ నేత శ్రీరాములు బంధువులని, గాలి జనార్దన్‌రెడ్డి సన్నిహితులని తెలుస్తోంది. అటు జేడీఎస్ శాసనసభాపక్ష భేటీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఒకవేళ ఈ ఎనిమిది మంది సభ్యులు (కాంగ్రెస్ నుంచి ఆరుగురు.. జేడీఎస్ నుంచి ఇద్దరు) బీజేపీకి ఆకర్షితులై.. తమ పార్టీల సమావేశాలకు దూరంగా ఉంటే.. అప్పుడు బీజేపీ బలనిరూపణ నల్లేరుమీద బండినడక అవుతోంది. బీజేపీ ప్రస్తుతం సాధారణ మెజారిటీకి ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు తక్కువగా ఉంది. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ఫిరాయిస్తే.. బీజేపీ సులుభంగానే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని భావించవచ్చు. కానీ, క్షణక్షణానికి కర్ణాటకలో రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం కాదు.. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాను తలుచుకుంటే బీజేపీ నుంచి రెట్టింపు ఎమ్మెల్యేలను లాక్కుంటానని కుమారస్వామి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం.. అసెంబ్లీలో బలనిరూపణ వరకు కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా, సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment