సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ఓడిపోలేదని, అసెంబ్లీలో యడ్యూరప్ప అత్యుత్తమ ప్రజాస్వామ్యస్ఫూర్తిని ప్రదర్శించి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రజాతీర్పుకు విరుద్ధంగా ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకున్న జేడీఎస్-కాంగ్రెస్‌లు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్న ఆయన.. కాబోయే సీఎం కుమారస్వామికి దిమ్మతిరిగేరీతిలో సవాల్ విసిరారు.
దమ్ముంటే..: ‘‘ఎన్నికల ముందు కాకుండా.. ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకున్న జేడీఎస్-కాంగ్రెస్‌ల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. నిన్నటిదాకా సాగిన కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపించకూడదనేదే ఆ రహస్య ఒప్పందం. నేను ముఖ్యమంత్రినైతే కాంగ్రెస్ అవినీతిపై దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ప్రచారంలో కుమారస్వామి అన్నారు. ఇప్పుడు మేం ఆయనకు సవాలు విసురుతున్నాం.. దమ్ముంటే చెప్పిన మాట(కాంగ్రెస్ అవినీతిపై దర్యాప్తు) మీద నిలబడండి. జేడీఎస్-కాంగ్రెస్‌ది ఫక్తూ అవకాశవాద పొత్తేకానీ సైద్ధాంతిక పొత్తు కానేకాదు’’ అని ప్రకాశ్ జవదేకర్ అన్నారు.
(చదవండి:బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప)
ఒక్కడికి భయపడి..: ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపైనా కేంద్ర మంత్రి జవదేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.‘‘బీజేపీ వ్యవస్థలను నాశనం చేస్తున్నదని రాహుల్ ఆరోపించారు. కానీ వాస్తవానికి ఈ దేశంలో వ్యవస్థలను భ్రష్టుపట్టించిందే కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్‌ను జరగనీయకుండా అడ్డుకోవడం, కాగ్‌ను విపరీతంగా నిందించడం, సుప్రీంకోర్టును ప్రభావితం చేయడం, ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. నిజంగా మేము ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిఉంటే వాళ్లు మా వెంట వచ్చేవాళ్లేకదా, తప్పుడు ఆడియోలతో కాంగ్రెస్ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. ఎన్నికల్లో ఓడిపోతే తప్పు ఈవీఎంలపై నెడతారు. యడ్యూరప్పను సీఎంగా ప్రమాణం చేసియిస్తే గవర్నర్‌ను నిందిస్తారు. మరి వీళ్ల సీఎంతో ప్రమాణం చేయిచేటప్పుడు మాత్రం గవర్నర్ మంచోడే అంటారు. మోదీ ఒక్కడికి భయపడి, ఆయనకు వ్యతిరేకంగా కూటములు నిర్మించడం నిజమైన రాజకీయం కానేకాదు. ఆ కూటములు ఎప్పటికీ నిలబడలేవు’’ అని జవదేకర్ వివరించారు.
(చూడండి: అసెంబ్లీలో బీజేపీ ఘోరతప్పిదం)
Comments
Please login to add a commentAdd a comment