సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక వ్యవహారంలో న్యాయపోరాటం తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. దేశంలో పేరొందిన న్యాయకోవిదుడైన సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు తాజాగా ముందుకొచ్చారు. బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ.. యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ.. సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యక్తిగత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట ఆయన ఈ మేరకు పిటిషన్ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా సవాలు చేస్తూ ఈ కేసులో వ్యక్తిగతంగా ఇంప్లీడ్ అయ్యే అవకాశం కల్పించాలని కోరారు. అయితే, శుక్రవారం ఈ విషయాన్ని సరైన బెంచ్ ముందు ప్రతిపాదించాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచించింది.
ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ.. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కానీ సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని వెంటనే నిలిపేయాలని కోరుతూ ఆ పార్టీలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. అయితే, గురువారం మధ్యాహ్నం రెండు గంటలలోగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను తమకు సమర్పించాలని యడ్యూరప్పను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని, యడ్యూరప్ప ప్రమాణస్వీకార అంశం తుది తీర్పుకు లోబడి ఉంటుందని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినప్పటికీ.. అసెంబ్లీలో ఆయన బలనిరూపణ చేసుకునే వరకు కర్ణాటక ప్రభుత్వం విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాం జెఠ్మలానీ సైతం గవర్నర్ వజుభాయ్ వాలా నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment