
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాలు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలిచిన కమలదళం.. ఎట్టిపరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు ఎరవేసి.. మంత్రి పదవులు ఆశజూపి తమవైపు లాక్కునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. బీజేపీ నేతలు తమకు అదేపనిగా ఫోన్ చేస్తున్నారని ఇటు కాంగ్రెస్, అటు జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. తమకు మద్దతునిస్తే.. కేబినెట్ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ బేరసారాలు ఆడుతున్నట్టు వారు చెబుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీ రాజెగౌడ బీజేపీ బేరసారాలపై నోరువిప్పారు. ‘బీజేపీ నేతలు అదేపనిగా ఫోన్ చేస్తున్నారు. అయినా మేం ఏమీ భయపడటం లేదు. నాకు ఫోన్ చేయవద్దని వారికి స్పష్టంగా చెప్పాను. నేను నిబద్ధత కలిగిన కాంగ్రెస్ వ్యక్తిని. చాలాకాలంగా వారు నన్ను అడుగుతూ వస్తున్నారు. వారి పనే ఇది’ అని రాజెగౌడ మీడియాకు తెలిపారు. జేడీఎస్ ఎమ్మెల్యే అమరెగౌడ లింగనగౌడ పాటిల్ కూడా బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చినట్టు తెలిపారు. ‘బీజేపీ నేతల నుంచి నాకు ఫోన్ వచ్చింది. మాతో వచ్చి చేరండి మీకు మంత్రి పదవి ఇస్తామని వారు చెప్పారు. కానీ జేడీఎస్‌తోనే ఉంటాను. కుమారస్వామే మా సీఎం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment