సాక్షి, బెంగళూరు: బలపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్ జరుగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన సభలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష తీర్మానంపై ప్రసంగిస్తూ.. మా దగ్గర 104 మంది ఎమ్మెల్యేల మాత్రమే ఉన్నారు కాబట్టి బలపరీక్షలో విఫలమయ్యామని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
‘‘ఇది నిజంగా అగ్నిపరీక్ష. ఇలాంటి పరీక్షలు ఎన్నో నా జీవితంలో ఎదుర్కొన్నాను. గతంలో రాష్ట్రం కోసం ఎంతో చేశాను. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు. కాంగ్రెస్, జేడీఎస్‌లను ఓటర్లు విశ్వసించలేదు. కానీ ఇవాళ వారు అపవిత్రపొత్తుతో ముందుకొచ్చారు. అవును. మాదగ్గర 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి బలపరీక్షలో మేం విఫలమయ్యాం అని చెప్పడానికి చింతిస్తున్నాం. అయితే నా ఆఖరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పాటుపడతా. 2019లో 28కి 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాం’’ అని యడ్యూరప్ప చెప్పారు. అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజనీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస 78, జేడీఎస్ 38, బీఎస్‌పీ 1, ఇతరులు 2 సీట్లను గెలుచుకోవడం, అతిపెద్ద పార్టీ అయిన కారణంగా బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం, ఆ వెంటనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం లాంటి పరిణామాలు చకచక జరిగిపోయాయి. సరిగ్గా 60 గంటలు కూడా గడవకముందే యడ్డీ బలపరీక్షలో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment