సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా ఎన్నికలపై కర్ణాటక రాజకీయలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఆ రాష్ట్ర అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తు న్నాయి. అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమవుతోందనే అంశాన్ని బీఆర్‌ఎస్ ఓటర్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఇచ్చిన హామీలను గాలికొదిలేస్తుందనే ప్రచారం చేస్తోంది. ఇటీవల జహీరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఎన్నికల ప్రచార ంలో భాగంగా కర్ణాటక వాసులతో బంధుత్వం ఉన్న మల్లేశంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అక్కడ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా బాగా లేదని, పింఛన్లు నామమాత్రంగా ఇస్తున్నారనే అంశాన్ని ఆయనతో చెప్పించి ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. అక్కడి ఓటర్లు కాంగ్రెస్‌ను ఎందుకు ఎన్నుకున్నామా? అని ఆ రాష్ట్రంలోని తమ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పిన మాటలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
హస్తం నేతల ప్రచారం
ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం విదితమే. ఆ ప్రభావం ఎక్కువగా జహీరాబాద్ నియోజకవర్గంపై ఉంటుందని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు జహీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ఆరాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. ఇటీవల పట్టణంలో ఉన్న షెట్కార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సమావేశానికి మంత్రులు రహీం, ఈశ్వర్‌ఖాండ్రే హాజరయ్యారు. తమ రాష్ట్రంలో ఎన్నికల హామీలు విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ సైతం..
బీజేపీ సైతం కర్ణాటక పార్టీ నేతలతో జహీరాబాద్‌లో ప్రచారం చేయిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పట్టణంలో బహిరంగ సభను నాయకులు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన పార్టీ ఆ రాష్ట్ర నేతలతోనైనా కొంతమేరకు ఊపు వస్తుందనే భావిస్తోంది. ప్రచారానికి వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది.
ఆ రాష్ట్రంతో సత్సంబంధాలు
కర్ణాటకతో జిల్లాలో ప్రధానంగా జహీరాబాద్, నారాయణఖేడ్ రెండు నియోజకవర్గాలకు సరిహ ద్దులు ఉన్నాయి. అందోల్ నియోజకవర్గంలోని రాయ్‌కోడ్ వంటి మండలాలు కూడా సమీపంలో ఉన్నాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు ఆరాష్ట్రంతో బంధుత్వాలు, స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. వ్యాపార లావాదేవీల కోసం కూడా సంబంధాలుంటాయి. ఈ నేపథ్యంలో అక్క డి రాజకీయాలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయో లేదో తెలియాలంటే వేచిచూడాలి.
నేడు కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప రాక
జహీరాబాద్: బుధవారం పట్టణానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి రాంచందర్ రాజనర్సింహ మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment