జహీరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుండటమే కాకుండా జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన బీబీ పాటిల్ కోటకు బీటలు వారాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీఆర్‌ఎస్ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్, నారాయణఖేడ్ స్థానాలను కోల్పోయింది.
జహీరాబాద్, బాన్సువాడ స్థానాలను మాత్రమే నిలుపుకొంది. పాటిల్ కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉండటంతో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ సభల నిర్వహణ బాధ్యతలు సైతం చూశారు. అలాగే సొంత పార్లమెంట్ పరిధిలోని సిట్టింగ్ స్థానాలను సైతం నిలుపుకోలేక పోయారు. అంతే కాకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 6,741 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో కేసీఆర్ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఈ స్థానం బీఆర్‌ఎస్ గెలుచుకుంది.
ఇదిలా ఉంటే పాటిల్ తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం అయిన జుక్కల్‌లో సైతం బీఆర్‌ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావు బీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండేపై గెలుపొందారు. ఎల్లారెడ్డిలోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న అందోల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ సైతం కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో 28 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నారాయణఖేడ్ స్థానం సైతం బీఆర్‌ఎస్ అభ్యర్థి అయిన భూపాల్‌రెడ్డి 6,547 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి చేతిలో ఓటమి చెందారు. బాన్సువాడ, జహీరాబాద్ సిట్టింగ్ స్థానాలను మాత్రమే బీఆర్‌ఎస్ నిలుపుకొంది. గత ఎన్నికల్లో జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థికి 35 వేల ఓట్ల మెజారిటీ రాగా అది 13 వేలకు పడిపోయింది.
ఇక్కడే ప్రచారానికి పరిమితం
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్లమెంట్ పరిధిలో అంతంత మాత్రంగానే ప్రచారం చేశారు. ప్రధానంగా తన సొంత నియోజకవర్గం అయిన జుక్కల్‌తోపాటు కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు. అయినా వారిని ఓటమి నుంచి తప్పించలేక పోయారు. కేసీఆర్, హరీశ్‌రావు జహీరాబాద్‌కు ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రమే పాటిల్ జహీరాబాద్ సభల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రచారానికి దూరంగా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో
పార్టీలవారీగా పోలైన ఓట్లు
బీఆర్‌ఎస్ : 5,30,194
కాంగ్రెస్ : 5,48,348
బీజేపీ : 1,72,575
Comments
Please login to add a commentAdd a comment