సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో మంత్రి పదవులపై చర్చ మొదలైంది. జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న దానిపై ఊహాగానాలు జోరందు కున్నాయి. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన షబ్బీర్‌అలీ గురించి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సాఫ్ట్‌వేర్ సంస్థల యజమాని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు కాలం కలిసొస్తే ఐటీ మంత్రిగా అవకాశం రావచ్చన్న ప్రచారం జరుగుతోంది.
జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఎల్లారెడ్డి, జుక్కల్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇద్దరు కూడా తొలిసారి విజయం సాధించారు. ఇందులో మదన్‌మోహన్‌రావు ఐటీ కంపెనీల యజమాని. ఆయన కు పార్టీ జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అదే ఆయనకు ఎల్లారెడ్డి టికెట్టు రావడానికి కారణమైంది. ఆయనకు మంత్రి మండలిలోనూ అవకాశం కల్పిస్తారని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో అనుభవంతో పాటు పార్టీలో ఐటీ రంగానికి సంబంధించి వివిధ రకాల సేవలందించినందున ఆయనకు ఐటీ శాఖ మంత్రి బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.
మైనారిటీ కోటాలో..
జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి షబ్బీర్‌అలీ.. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే అప్పటి చెన్నారెడ్డి మంత్రిమండలిలో అవకాశం దక్కించుకున్నారు. తర్వా త 2004 ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్ మంత్రి మండలిలో క్యాబినెట్ మంత్రిగా చేరారు. 2009 లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, శాసన మండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగించింది. ఆయన 2014, 2018 ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆయన నాలుగైదేళ్లుగా జనంలోనే ఉండి నిరంతరం పనిచేశారు.
అయితే కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీకి దిగడంతో షబ్బీర్ స్థానంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి వచ్చారు. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి షబ్బీర్‌ను బరిలోకి దింపినా గెలవలేకపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో షబ్బీర్‌కు మంత్రి మండలిలో అవకాశం దక్కుతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లానుంచి గెలిచిన కాంగ్రెస్ నేతల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న విషయమై అంతటా చర్చలు నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment