ఓటరు స్లిప్‌లో వెనుక భాగంలో గూగుల్ మ్యాప్
నారాయణఖేడ్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా జిల్లా అధికారులు ఓటరు స్లిప్‌లు, ఎపిక్ కార్డుల పంపిణీ ముమ్మరం చేశారు. ఓటర్ల తుదిజాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 13,93,711 మంది. వీరందరికీ పోల్ చీటీలు, కొత్తగా ఓటుహక్కు పొందిన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ మొదలు పెట్టారు. పోస్టల్ సిబ్బంది, బీఎల్‌వోలు ఇంటింటికీ వాటిని పంపిణీ చేస్తున్నారు.
పూర్తి వివరాలతో..
పోల్ చీటీలపై ఓటరు పేరు, చిరునామా, ఓటరు సంఖ్య, పోలింగ్ కేంద్రం, పోలింగ్ తేదీ, సమయం, హెల్ప్‌లైన్ నంబర్, పలు సూచనలతో పూర్తి వివరాలు నమోదు చేశారు. పోలింగ్ రోజు ఓటర్లు సులువుగా కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉంటుంది. గతంలో వాటిని పార్టీల వారే ముద్రించి పంపిణీ చేసేవారు. అయితే ప్రచారం ముగిసినా తర్వాత పోల్ చీటీల పంపిణీ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా ఆయా పార్టీల శ్రేణులు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని గమనించిన ఎన్నికల సంఘం దానిని నివారించింది. గత ఎన్నికల నుంచి అధికారికంగానే వీటిని పంపిణీ చేస్తున్నారు.
అడ్రస్ చూపే మ్యాప్
గతంలో పోల్ చీటీలో కేవలం ఓటరు ఫొటో, వివరాలు మాత్రమే ఉండేవి. ఈసారి ఎన్నికల్లో నూతన విధానంలో పోల్ చీటీలను రూపొందించారు. ఫొటో స్థానంలో క్యూఆర్ కోడ్ ఉంది. పోలింగ్ తేదీ, పోలింగ్ ప్రారంభం, ముగింపు సమయం, పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబరు, గ్రామం, పోలింగ్ కేంద్రం, టోల్ ఫ్రీ నంబర్ ముద్రించారు. దాని వెనుక వైపు పోలింగ్ కేంద్రానికి సులువుగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ ప్రింట్ చేశారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బూత్‌స్థాయి అధికారి పేరు, మొబైల్ నంబరు ప్రింట్ చేశారు. ఓటరు తెలుసుకోవాల్సిన నిబంధనలు అందులో వివరించారు. అయితే బూత్‌లెవల్ అధికారులు తమ బూత్ పరిధిలో ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నారు. ఈ సమయంలో కుటుంబంలో ఓటరుగా నమోదైన వ్యక్తికి మాత్రమే ఇస్తున్నారు.
ఇంట్లో ఉన్న ఓటర్లు అందరికీ ఓటరు పత్రాలు తీసుకున్నట్లు రసీదుగా రిజిస్టర్‌లో సంతకం లేదా వేలిముద్రలను తీసుకుంటున్నారు. స్లిప్పులు ప్రతి ఓటరుకు అందేలా సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. బీఎల్‌ఓలు ఇళ్లకు వెళ్లిన సమయంలో ఎవరైనా తాళం వేసి ఉంటే అలాంటి వారికి పోలింగ్ రోజున బూత్‌లెవల్ అధికారులు హెల్ప్‌లైన్ సెంటర్‌లో అందించనున్నారు. ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు ఈ స్లిప్పుతోపాటు ఎన్నికల సంఘం ప్రకటించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళితేనే ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తారు.
నియోజకవర్గం బూత్‌లు మొత్తం ఓటర్లు
నారాయణఖేడ్ 296 2,31,188
అందోల్ 313 2,49,248
జహీరాబాద్ 314 2,70,785
సంగారెడ్డి 281 2,45,253
పటాన్‌చెరు 405 3,97,237
Comments
Please login to add a commentAdd a comment