శివాజీనగర: ఈసారి విధానసభా ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలై గత ఎన్నికల కంటే 38 సీట్లను తక్కువ గెలిచింది. మాజీ సీఎం, సీనియర్ నేత యడియూరప్పకు పెద్దపీట వేయకపోవడం, జగదీశ్ షెట్టర్ వంటి లింగాయిత నేతలను దూరం చేసుకోవడం, నేతల మధ్య విభేదాలే ఈ దుస్థితికి కారణమని పార్టీలో ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యడియూరప్పను, ఆయన సన్నిహితులను పక్కనపెట్టడం వల్ల 10 నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయినట్లు అంచనా. దీంతో లింగాయత ఓట్లను లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీకి నష్టం వాటిల్లగా, అనేక నియోజకవర్గాల్లో ఓట్లను కోల్పోయింది.
సీటీ రవి వర్సెస్ యడ్డి
చిక్కమగళూరులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీ.టీ.రవి, హెచ్.డీ.తమ్మయ్య చేతిలో ఓడిపోయారు. హెచ్.డీ.తమ్మయ్య యడ్డి సన్నిహితుల్లో ఒకరు. అయితే టికెట్ దొరక్కపోవడంతో కాంగ్రెస్‌లోకి చేరి పోటీ చేశారు. ఆయన లింగాయత వర్గానికి చెందినవారు కాగా, సుమారు 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ లింగాయత్ ఓటర్లు పెద్దసంఖ్యలో ఉండడం గమనార్హం. ఎన్నికలకు ముందు సీటీ రవి యడియూరప్పపై విజయేంద్రపై పరోక్షంగా విమర్శలు గుప్పించేవారు. బీజేపీలో అభ్యర్థుల టికెట్లను ఏ ఒక్కరి ఇంట్లోనో నిర్ణయించరని అన్నారు. వారి విభేదాల వల్ల చిక్కమగళూరులో యడియూరప్ప ప్రచారం కూడా చేయలేదు. ఆయన వర్గీయులు తమ్మయ్యకు గుట్టుగా మద్దతిచ్చి సీటీ రవిని ఓడించినట్లు ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment