కర్ణాటక సీఎం యడ్యూరప్ప, గవర్నర్ వజుభాయ్ వాలా(పాత ఫొటో)
న్యూఢిల్లీ: కర్ణాటక పొలిటికల్ థ్రిల్లర్‌లో నిమిషానికో మలుపు.. సెకనుకో ఊహాగానం! శుక్రవారం నాటి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కర్ణాటక అసెంబ్లీలో శనివారం జరుగనున్న బలపరీక్షలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఎదురుచూస్తున్నవేళ.. జేడీయూ-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నారని, గవర్నర్‌కు సమర్పించిన 115 సంతకాల్లో ఆ ఎనిమిది మందివి ఫోర్జరీ చేసిఉండొచ్చని ‘రిపబ్లిక్ టీవీ’ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం..
సుప్రీంకోర్టుకు ఫోర్జరీ సంతకాల జాబితా: కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ శిబిరంలో లేరు. వారంతా ఢిల్లీలో బీజేపీ నేతల సంరక్షణలో ఉన్నారు. శనివారం బలపరీక్ష సమయానికి వారిని బెంగళూరుకు తరలించనున్నారు. నిజానికి బెంగళూరు ఈగిల్టన్ రిసార్ట్స్, షాంగ్రీ-లా హోటల్‌ల్లో శిబిరాలు ఏర్పాటేచేసేనాటికే ఆ ఎనిమిది మంది జంప్ అయ్యారట. గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలోనూ ఈ ఎనిమిది మంది సంతకాలు చేయలేదట. దీంతో ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి సంతకాలను సేకరించి.. ఫోర్జరీ చేశారట. ఆ ఎనిమిది ఫోర్జరీ సంతకాల జాబితానే కాంగ్రెస్, జేడీఎస్‌లు గవర్నర్‌కు, ఆపై సుప్రీంకోర్టుకు పంపాయని ‘రిపబ్లిక్’ కథనంలో వెల్లడించింది. అలా 104కు మరో ఎనిమిది మంది జంప్ జిలానీలు తోడుకాగా బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్(112)కు చేరుకుంటుంది కాబట్టి బలపరీక్షలో యడ్యూరప్ప సునాయాసంగా గెలుస్తారన్నది ఆ కథనం సారాంశం.
కాంగ్రెస్ ఏమంటోంది?: తమ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరిని.. బీజేపీ నేతలు ఢిల్లీలో బంధించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ఎమ్మెల్యే (ఆనంద్ సింగ్) పేరును కూడా వెల్లడించింది. అయితే, ‘రిపబ్లిక్’ కథనం చెప్పినట్లు 8 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కాంగ్రెస్ వర్గాలు ఎక్కడా ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment