
బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్ష నేత, కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేతో బేరసారాలు జరిపిన ఆడియో టేప్ సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు ఫోన్ చేసిన యడ్యూరప్ప బీజేపీకి మద్దతు తెలిపితే మంత్రి పదవి ఇస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని చెబుతున్న ఆడియో టేపును కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది.
బల పరీక్షకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. యడ్యూరప్ప తనయుడికి సంబంధించిన మరో టేపును కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాగా, ఇప్పటివరకూ విపక్ష శిబిరం నుంచి మొత్తం 10 మందికి బీజేపీ గాలం వేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు, జేడీఎస్ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెట్లను బీజేపీ తనవైపు ఆకర్షించిందని తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణరావు, రాజశేఖర్ పాటిల్, మహాతేజ, హోళగెరి, బయ్యాపూర్ అమెరగడలు, జేడీఎస్ నుంచి వెంకట రావ్ నడగడ, స్వతంత్రులు నరేష్, శంకర్‌లు ఇందులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటివరకూ ప్రొటెం స్పీకర్ 210 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. మధ్యాహ్నం 03.30 గంటలకు అసెంబ్లీని వాయిదా వేశారు. దీంతో మిగతావారి ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment