యడ్యూరప్ప(ఎడమ), జగదాంబిక పాల్(కుడి)
సాక్షి, వెబ్ డెస్క్ : కర్ణాటకలో రాజకీయ నాటకీయత తుది దశకు చేరుకుంది. రేపు (శనివారం) సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన శనివారం బల పరీక్ష జరగనుంది. బల పరీక్ష బీజేపీకి శరాఘాతమనే చెప్పుకోవాలి. సుప్రీంకోర్టులో ఆ పార్టీ తరఫు న్యాయవాది చేసిన ఏ వాదనతో ముగ్గరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకీభవించలేదు. కచ్చితంగా బల పరీక్ష జరిగి తీరాలని తీర్పునిచ్చింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే కొన్ని రాష్ట్రాలు న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది 1997 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు ఘటన.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం-1997
1997 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగదాంబిక పాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఒక్క రోజులోనే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రముఖ ఘటన ఇది. ఒక్క రోజు సీఎంగా ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికీ జగదాంబిక పాల్‌ను స్థానికులు చెప్పుకుంటుంటారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు కళ్యాణ్ సింగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడం అప్పట్లో ఉత్తరప్రదేశ్‌లో వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు జగదాంబిక పాల్‌ను ఆహ్వానించిన గవర్నర్ రోమేష్ భండారీ బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. విశ్వాస పరీక్ష సమయంలో అసెంబ్లీలో హింస చెలరేగి రక్తపాతం జరగడంతో రాష్ట్రపతి పాలన విధించాలని భండారీ కేంద్రానికి సూచించారు. అయితే, ఇందుకు కేంద్రం నిరాకరించడంతో బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
బయట పార్టీల ఎమ్మెల్యేలను కేబినేట్ సభ్యులుగా గుర్తించేందుకు గవర్నర్ నిరాకరించడంతో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ వెంటనే కాంగ్రెస్‌కు చెందిన జగదాంబిక పాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, పాల్ ప్రభుత్వం ఒక్క రోజుకు మించి నిలబడలేదు. పాల్ బీజేపీ తరఫున లోక్‌సభలో ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీకి 104 ఎమ్మెల్యేలు, బయట నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్-జేడీఎస్‌లకు 116 (కాంగ్రెస్ :78, జేడీఎస్ : 38) మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో రేపు విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప నెగ్గుతారా? లేక మూడు రోజుల ముఖ్యమంత్రిగా మిగిలిపోతారా? అనేది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment