ప్రమాణ స్వీకారం అనంతరం యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బీఎస్ యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. 56వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తూ ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. రైతు వ్యతిరేక నిర్ణయాల కారణంగానే సిద్దరామయ్య ప్రభుత్వం ఓడిపోయిందన్న విషయాన్ని గమనించిన యడ్యూరప్ప.. సీఎంగా ప్రమాణ స్వీకారం మొదలు మొదటి నిర్ణయం వరకు రైతు అనుకూల వైఖరిని అనుసరించారు. రైతులకు సంఘీభావంగా ఆకుపచ్చ కండువా కప్పుకొని ప్రమాణం స్వీకారం చేసిన యడ్యూరప్ప.. దైవసాక్షిగా, రైతుసాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందితే రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని యడ్యూరప్ప హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదట రైతులకు ఇచ్చిన హామీని యడ్యూరప్ప నెరవేర్చారు. ప్రస్తుతం యడ్యూరప్ప మాత్రమే సీఎంగా ప్రమాణం స్వీకరించిన సంగతి తెలిసిందే. బలనిరూపణ విషయంలో సందిగ్ధం కొనసాగుతుండటంతో మంత్రిమండలి ప్రమాణం చేయలేదు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుందుకే యెడ్డీకి గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చారు. బలనిరూపణ చేసుకున్న తర్వాత ఆయన మంత్రిమండలి కొలువుదీరే అవకాశముంది. పూర్తిస్థాయిలో మంత్రిమండలి కొలువుదీరిన తర్వాత యడ్యూరప్ప మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చునని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment