
న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్‌లది అధికారం కోసం ఏర్పడిన అవకాశవాద కూటమి అని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ విమర్శించారు. విపక్ష నేతలంతా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరవ్వడాన్ని ‘అవినీతి సంబరం’గా ఆయన అభివర్ణించారు. 2019 ఎన్నికల్లో ఆయా పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రధాని మోదీని ఓడించాలనుకోవడం పగటికలేనని ప్రసాద్ అన్నారు. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా గద్దెనెక్కిన ప్రభుత్వం ఇదని పేర్కొన్నారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన బుధవారాన్ని బీజేపీ బ్లాక్ డేగా పాటించింది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఆధ్వర్యంలో బెంగళూరులోని ఆనంద్ రావు కూడలి వద్ద గాంధీజీ విగ్రహం ముందు బీజేపీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్‌లో మోసపోయామనే భావనలో ఉన్న నేతలు బీజేపీలోకి రావాలని యడ్యూరప్ప ఆహ్వానించారు.