న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకంపై ఉత్కంఠకు తెరపడనుంది. సోమ లేదా మంగళవారానికి మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నిర్ణయం వెలువడుతుందని కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ ఆదివారం చెప్పారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్య చికిత్స నిమిత్తం, ఆమె కొడుకు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి విదేశాలకు వెళ్లారు. వారు తిరిగి రావడానికి కనీసం వారం పడుతుందనీ, అప్పటివరకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని తొలుత ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిపై కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, సోనియా, రాహుల్‌ల విదేశీ పర్యటన మంత్రివర్గ కూర్పుకు ఆటంకం కాబోదని స్పష్టం చేశారు.
ఫోన్‌లో సంప్రదించడానికి రాహుల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకం ఇంకా పూర్తికాకపోవడం తెలిసిందే. రాష్ట్ర నేతలతో సంప్రదించి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న అనంతరం తుది ఆమోదం కోసం ఆ జాబితాను అధిష్టానానికి పంపుతామని వేణుగోపాల్ చెప్పారు. ఆర్థిక, హోం, ప్రజా పనులు, విద్యుత్తు, నీటిపారుదల, పట్టణాభివృద్ధి తదితర కీలక మంత్రిత్వ శాఖల పంపకాలపై కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య విభేదాలు తలెత్తడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వర ఇప్పటికే ప్రమాణం చేశారు. ఒప్పందం ప్రకారం ఇంకా కాంగ్రెస్‌కు 21, జేడీఎస్‌కు 11 మంత్రిపదవులు దక్కాల్సి ఉంది.
యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను ఆమోదించారా?
బీజేపీకి చెందిన ఎంపీలు బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాముల రాజీనామాలపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ లోక్‌సభ సెక్రటేరియట్‌ను కోరారు. కర్ణాటకకు చెందిన ఎంపీలు బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాములు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో వారిద్దరూ లోక్‌సభకు రాజీనామాలు సమర్పించినట్లు ప్రకటించారు. వారి రాజీనామాలను వెంటనే ఆమోదించినట్లు ప్రకటించిన లోక్‌సభ సెక్రటేరియట్.. వెబ్‌సైట్ లో మాత్రం ఆ స్థానాలను ఖాళీగా చూపడం లేదని అహ్మద్ పటేల్ చెప్పారు. ఈనెల 17వ తేదీన ఆ ఇద్దరూ రాజీనామా చేయగా 27 వరకు వారిని ఎంపీలుగానే వెబ్‌సైట్ చూపుతోందనీ, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment