Debt waiver to farmer
-
రైతులను ఎన్నిసార్లు మోసం చేస్తారు?: చిన్నారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రైతుల్ని మోసగించాలని చూస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణలో 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించకపోగా బాధితులను ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని ఓ పండుగలా చేస్తామన్నారు. పెట్టుబడి సాయాన్ని కొనసాగించడంతో పాటు, అన్ని వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో అమలు చేస్తున్నట్లుగానే రైతులకు సహకార బ్యాంకుల ద్వారా రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. భూప్రక్షాళనలో 9లక్షల తప్పులు దొర్లినట్లు సీఎం కేసీఆరే చెప్పారని, ఆ తప్పుల వల్ల చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయం విషయంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో వరుసగా మూడేళ్లు కరువు వచ్చినా ఒక్కసారి కూడా కేంద్రానికి నివేదికలు పంపకపోగా రాష్ట్రం తరఫున ఇవ్వాల్సిన సహాయాన్ని కూడా ఇవ్వలేదని విమర్శించారు. -
నేడో రేపో మంత్రివర్గ కూర్పు
న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకంపై ఉత్కంఠకు తెరపడనుంది. సోమ లేదా మంగళవారానికి మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నిర్ణయం వెలువడుతుందని కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ ఆదివారం చెప్పారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్య చికిత్స నిమిత్తం, ఆమె కొడుకు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి విదేశాలకు వెళ్లారు. వారు తిరిగి రావడానికి కనీసం వారం పడుతుందనీ, అప్పటివరకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని తొలుత ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిపై కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, సోనియా, రాహుల్‌ల విదేశీ పర్యటన మంత్రివర్గ కూర్పుకు ఆటంకం కాబోదని స్పష్టం చేశారు. ఫోన్లో సంప్రదించడానికి రాహుల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకం ఇంకా పూర్తికాకపోవడం తెలిసిందే. రాష్ట్ర నేతలతో సంప్రదించి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న అనంతరం తుది ఆమోదం కోసం ఆ జాబితాను అధిష్టానానికి పంపుతామని వేణుగోపాల్ చెప్పారు. ఆర్థిక, హోం, ప్రజా పనులు, విద్యుత్తు, నీటిపారుదల, పట్టణాభివృద్ధి తదితర కీలక మంత్రిత్వ శాఖల పంపకాలపై కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య విభేదాలు తలెత్తడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వర ఇప్పటికే ప్రమాణం చేశారు. ఒప్పందం ప్రకారం ఇంకా కాంగ్రెస్‌కు 21, జేడీఎస్‌కు 11 మంత్రిపదవులు దక్కాల్సి ఉంది. యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను ఆమోదించారా? బీజేపీకి చెందిన ఎంపీలు బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాముల రాజీనామాలపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ లోక్‌సభ సెక్రటేరియట్‌ను కోరారు. కర్ణాటకకు చెందిన ఎంపీలు బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాములు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో వారిద్దరూ లోక్‌సభకు రాజీనామాలు సమర్పించినట్లు ప్రకటించారు. వారి రాజీనామాలను వెంటనే ఆమోదించినట్లు ప్రకటించిన లోక్‌సభ సెక్రటేరియట్.. వెబ్సైట్ లో మాత్రం ఆ స్థానాలను ఖాళీగా చూపడం లేదని అహ్మద్ పటేల్ చెప్పారు. ఈనెల 17వ తేదీన ఆ ఇద్దరూ రాజీనామా చేయగా 27 వరకు వారిని ఎంపీలుగానే వెబ్సైట్ చూపుతోందనీ, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. -
అధికారం కోసం నాటకాలు
న్యూఢిల్లీ: సమగ్రాభివృద్ధి, అవినీతిపై పోరాటం అంటూ బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను మోసం చేశారని యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. అధికారాన్ని అందుకునేందుకు నాటకాలు ఆడారని విమర్శించారు. ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీని ఉద్దేశించి శనివారం సోనియా ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీని లక్ష్యంగా తీవ్రమైన విమర్శలు చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశానికి వివక్ష, అహంకార,కుట్రపూరిత రాజకీయాలనుంచి విముక్తి కల్పించాలన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని.. ఎన్డీయే ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్లీనరీలో పార్టీ లక్ష్యాలను నిర్దేశిస్తూ వ్యవసాయం, రాజకీయ పరిస్థితులపై పోరాటం, యువత, ఉపాధికల్పన, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం తదితర అంశాలపై రూపొందించిన తీర్మానాలను ఆమోదించారు. కుట్రపూరితంగా అధికారంలోకి.. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, నా ఖావూంగా – నా ఖానేదూంగా అంటూ మోదీ ఇచ్చిన నినాదాలన్నీ నాటకాలే. అధికారాన్ని అందుకునేందుకు పన్నిన కుట్రలే’ అని మోదీపై ఘాటుగా విమర్శలు చేశారు. నిరంకుశ మోదీ ప్రభుత్వంతో కాంగ్రెస్ పోరాడుతోందని పేర్కొన్న సోనియా.. 2014లో అధికారంలోకి వచ్చేందుకు మోదీ చేసిన వాగ్దానాలన్నీ బూటకమేనని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ‘మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లింది. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కోట్ల మంది పేదరికం నుంచి బయటకువచ్చారు. కానీ నేటి మోదీ ప్రభుత్వం ఆ విధానాలను బలహీనపరిచింది. అధికారంలో ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. కానీ కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాల ముందు మోకరిల్లదు’ అని సోనియా విమర్శించారు. మోదీ ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. ‘పార్టీని బలోపేతం చేయటమే మన మొదటి ప్రాధాన్యం కావాలి. కాంగ్రెస్ ఒక పార్టీ కాదు. ఒక ఆలోచన. కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కార్యకర్తలు, నాయకులు సంపూర్ణ మద్దతు తెలపాలి’ అని సోనియా కోరారు. రాహులే ప్రధాని: సిద్దరామయ్య త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు లౌకికవాదం, మతతత్వం మధ్య జరుగుతున్న పోరాటమని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ఈ ఎన్నికల ఫలితాలే తొలి అడుగన్నారు. ‘2019లో రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరు. భారీ మెజారిటీతో మళ్లీ కర్ణాటకలో అధికారంలోకి వస్తాం’ అని సిద్దరామయ్య తెలిపారు. ప్లీనరీ తీర్మానాలు భావసారూప్య పార్టీలను కలుపుకుని సహకారాత్మక విపక్షాన్ని రూపొందించాలన్న తీర్మానానికి ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది. పొత్తులతో 2019లో బీజేపీ–ఆరెస్సెస్ కూటమిని ఓడించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ‘దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన నేతల మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. బీజేపీ నేతృత్వంలో దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కాంగ్రెస్ మాత్రమే రూపుమాపగలదు’ అని ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. గణతంత్ర, ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను కాపాడేందుకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధమవ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు. దీంతోపాటుగా ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్లతో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా తీర్మానించారు. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయని.. తద్వారా ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోకుండా బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ సరైనదని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో దేశంలో సమతుల్యత నెలకొనేలా మీడియా వ్యవహరించాలని కోరారు. అంతర్గత భద్రత, యువత, మహిళల సాధికారత, సామాజిక న్యాయం తదితర అంశాలనూ తీర్మానంలో ప్రస్తావించారు. రుణమాఫీ చేస్తాం.. తాము అధికారంలోకి వస్తే చిన్న, సన్నకారు రైతుల రుణాలన్నీ మాఫీచేస్తామని పార్టీ తీర్మానంలో పేర్కొంది. 2009లో యూపీఏ ప్రభుత్వం చేసినట్లుగానే ఈసారీ మాఫీ చేస్తామని వెల్లడించింది. ‘వ్యవసాయం, ఉపాధికల్పన, పేదరిక నిర్మూలన’ పేరుతో పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ మోదీ ప్రభుత్వం బూటకపు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధరను పెంచటం, అటవీ ఉత్పత్తులపై గిరిజనులకే అధికారాన్ని కల్పించటం తమ పార్టీ లక్ష్యాలని పేర్కొన్నారు. పేదలకు జరిగే లబ్ధిని ఆధార్ ద్వారా అడ్డుకోకుండా కాంగ్రెస్ భరోసా ఇస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే.. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని సమీక్షిస్తామని వెల్లడించారు. అధికారంలోకి రాగానే దేశంలో ఉన్న ఒకశాతం అత్యంత ధనికుల నుంచి 5 శాతం సెస్ వసూలుచేసి ‘పేదరిక నిర్మూలన నిధి’ ఏర్పాటుచేస్తామన్నారు. దేశం విసిగిపోయింది: రాహుల్ నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనతో దేశం విసిగిపోయిందని.. అందుకే ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఉపాధికల్పన, రైతు సమస్యల పరిష్కారంలో దారుణంగా విఫలమైందన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని ఏకం చేసి.. ముందుకు తీసుకెళ్తుంది. అధికార పార్టీ విద్వేషాన్ని రెచ్చగొడుతోంది. కానీ మేం.. సోదరభావాన్ని, ప్రేమను పంచుతాం.అదే మాకు, వారికి ఉన్నతేడా’ అని రాహుల్ తెలిపారు. త న నాయకత్వంలో పార్టీ అనుభవజ్ఞులైన సీనియర్లు, యువరక్తం కలయికతో.. సరికొత్త దిశలో ముందుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మోదీ పాలనలో ఉద్యోగాల్లేక యువకులు దీనంగా ప్రధాని మోదీవైపు చూస్తున్నారు. తమ పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక రైతులు ఆవేదన చెందుతున్నారు. దేశం అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం తీరుతో విసిగి వేసారిపోయింది. అలాంటివారందరికీ మేం సరైన దారిచూపిస్తామని భరోసా ఇస్తున్నా’ అని రాహుల్ తెలిపారు. దేశ ప్రజలందరినీ ఏకం చేసి ముందుకు నడిపించే శక్తి తమ పార్టీ గుర్తు ‘హస్తం’కే ఉందన్నారు. ‘హిందుత్వతో హిందూయిజానికి సంబంధం లేదు. బీజేపీకి ఉన్న హిందూ ఓటుకు తలవంచాల్సిన పనిలేదు’ అని కాంగ్రెస్ సీనియర్‌నేత శశిథరూర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. తల్లి సోనియాకు రాహుల్ గాంధీ ఆత్మీయ ఆలింగనం -
రుణమాఫీపై ఆందోళన వద్దు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : రైతు రుణమాఫీ అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదని, రుణమాఫీపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. శనివారం డిచ్పల్లి మండలం ఇందల్వాయి ప్రాథమిక సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు. సహకార సంఘం పరిధిలోని ఇందల్వాయి, చంద్రాయన్పల్లి, త్రయంబక్‌పేట్ రైతులకు సబ్సిడీ సోయా విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిం చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటీని తమ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తప్పకుండా అమలు చేస్తారని స్పష్టం చేశారు. రుణమాఫీపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం వారం రోజులు మాత్రమే అయిందన్నారు. రుణమాఫీకి సంబంధించి మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, బ్యాంకు అధికారులు స మాలోచనలు చేస్తున్నారని తెలిపారు. అరవై యేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్య లు రాకుండా కేసీఆర్ కృషి చేస్తారన్నారు. ఆందోళనలు అర్థరహితం రుణమాఫీ గురించి ప్రతిపక్షపార్టీల రాస్తారోకోలు, నిరసనలు జరపడం అర్థరహితమన్నారు. అమరుల కుటుంబాలకు *10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు, కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇచ్చే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరుతో పాటు 10 గం టల నిరంతర ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామన్నారు. ఇందల్వాయి శివారులోని సర్వే నెంబరు 1107లోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 500 జనాభా కలిగిన ప్రతి గిరిజన తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వైఎస్సార్‌తోనే రాజకీయ భిక్ష ధర్పల్లి :తాను రాజకీయల్లోకి రావటానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అ న్నారు. ఆయనతోనే తనకు రాజకీయ భిక్ష లభించిందన్నారు. అందుకే ఆయన కు టుంబానికి అండగా ఉన్నానని అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల పథకం కింద నియోజక వర్గంలోని 1.60 లక్షల ఎకరాల కు సాగునీరు అందేలా కృషి చేస్తానని అన్నారు. మండలకేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఆయన సోయా విత్తనాలు పంపి ణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధర్పల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సామర్థ్యం పెంచేలా చూస్తానన్నారు. పసుపు పరిశోధన ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. డీఎస్ది ఎన్నిక ల్లో టికెట్లు అమ్ముకునే సంస్కృతి అని ఆరోపించారు. ఆయన అభివృద్ధి చేసేది వచ్చిన నిధుల్లో కమీషన్లు దోచుకునేందుకే విమర్శించారు. సోనియా వద్ద చెంచాగిరి చేస్తే ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణ రాష్ట్రం రావటానికి కేసీఆర్ పాత్ర కీలకం అన్నారు. కేసీఆర్ కుటుంబానికి అండగా ఉంటానని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ఓటమి భయంతోనే ఉచిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారన్నారు.