అధికారం కోసం నాటకాలు | Modi’s promises are theatrics, says Sonia | Sakshi
Sakshi News home page

అధికారం కోసం నాటకాలు

Published Sun, Mar 18 2018 1:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Modi’s promises are theatrics, says Sonia - Sakshi

కాంగ్రెస్‌ ప్లీనరీలో రాహుల్‌ గాంధీ, సోనియా, మన్మోహన్, ఆంటోనీ, ఆజాద్, ఖర్గే

న్యూఢిల్లీ: సమగ్రాభివృద్ధి, అవినీతిపై పోరాటం అంటూ బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను మోసం చేశారని యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. అధికారాన్ని అందుకునేందుకు నాటకాలు ఆడారని విమర్శించారు. ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ 84వ ప్లీనరీని ఉద్దేశించి శనివారం సోనియా ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీని లక్ష్యంగా తీవ్రమైన విమర్శలు చేశారు.

పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశానికి వివక్ష, అహంకార,కుట్రపూరిత రాజకీయాలనుంచి విముక్తి కల్పించాలన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని.. ఎన్డీయే ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ విమర్శించారు. ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్లీనరీలో పార్టీ లక్ష్యాలను నిర్దేశిస్తూ వ్యవసాయం, రాజకీయ పరిస్థితులపై పోరాటం, యువత, ఉపాధికల్పన, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం తదితర అంశాలపై రూపొందించిన తీర్మానాలను ఆమోదించారు.

కుట్రపూరితంగా అధికారంలోకి..
‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, నా ఖావూంగా – నా ఖానేదూంగా అంటూ మోదీ ఇచ్చిన నినాదాలన్నీ నాటకాలే. అధికారాన్ని అందుకునేందుకు పన్నిన కుట్రలే’ అని మోదీపై ఘాటుగా విమర్శలు చేశారు. నిరంకుశ మోదీ ప్రభుత్వంతో కాంగ్రెస్‌ పోరాడుతోందని పేర్కొన్న సోనియా.. 2014లో అధికారంలోకి వచ్చేందుకు మోదీ చేసిన వాగ్దానాలన్నీ బూటకమేనని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ‘మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లింది.

మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కోట్ల మంది పేదరికం నుంచి బయటకువచ్చారు. కానీ నేటి మోదీ ప్రభుత్వం ఆ విధానాలను బలహీనపరిచింది. అధికారంలో ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. కానీ కాంగ్రెస్‌ ఇలాంటి రాజకీయాల ముందు మోకరిల్లదు’ అని సోనియా విమర్శించారు. మోదీ ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. ‘పార్టీని బలోపేతం చేయటమే మన మొదటి ప్రాధాన్యం కావాలి. కాంగ్రెస్‌ ఒక పార్టీ కాదు. ఒక ఆలోచన. కొత్త అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కార్యకర్తలు, నాయకులు సంపూర్ణ మద్దతు తెలపాలి’ అని సోనియా కోరారు.

రాహులే ప్రధాని: సిద్దరామయ్య
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు లౌకికవాదం, మతతత్వం మధ్య జరుగుతున్న పోరాటమని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ఈ ఎన్నికల ఫలితాలే తొలి అడుగన్నారు. ‘2019లో రాహుల్‌ గాంధీ ప్రధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరు. భారీ మెజారిటీతో మళ్లీ కర్ణాటకలో అధికారంలోకి వస్తాం’ అని సిద్దరామయ్య తెలిపారు.  

ప్లీనరీ తీర్మానాలు
భావసారూప్య పార్టీలను కలుపుకుని సహకారాత్మక విపక్షాన్ని రూపొందించాలన్న తీర్మానానికి ప్లీనరీలో కాంగ్రెస్‌ పార్టీ ఆమోదం తెలిపింది. పొత్తులతో 2019లో బీజేపీ–ఆరెస్సెస్‌ కూటమిని ఓడించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ‘దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన నేతల మార్గదర్శకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. బీజేపీ నేతృత్వంలో దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కాంగ్రెస్‌ మాత్రమే రూపుమాపగలదు’ అని ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

గణతంత్ర, ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను కాపాడేందుకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధమవ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు. దీంతోపాటుగా ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్‌ పేపర్లతో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా తీర్మానించారు. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయని.. తద్వారా ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోకుండా బ్యాలెట్‌ పేపర్లతో ఓటింగ్‌ సరైనదని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో  దేశంలో సమతుల్యత నెలకొనేలా మీడియా వ్యవహరించాలని కోరారు. అంతర్గత భద్రత, యువత, మహిళల సాధికారత, సామాజిక న్యాయం తదితర అంశాలనూ తీర్మానంలో ప్రస్తావించారు.  

రుణమాఫీ చేస్తాం..
తాము అధికారంలోకి వస్తే చిన్న, సన్నకారు రైతుల రుణాలన్నీ మాఫీచేస్తామని పార్టీ తీర్మానంలో పేర్కొంది. 2009లో యూపీఏ ప్రభుత్వం చేసినట్లుగానే ఈసారీ మాఫీ చేస్తామని వెల్లడించింది. ‘వ్యవసాయం, ఉపాధికల్పన, పేదరిక నిర్మూలన’ పేరుతో పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ మోదీ ప్రభుత్వం బూటకపు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.

రైతులకు మద్దతు ధరను పెంచటం, అటవీ ఉత్పత్తులపై గిరిజనులకే అధికారాన్ని కల్పించటం తమ పార్టీ లక్ష్యాలని పేర్కొన్నారు. పేదలకు జరిగే లబ్ధిని ఆధార్‌ ద్వారా అడ్డుకోకుండా కాంగ్రెస్‌ భరోసా ఇస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి రాగానే.. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని సమీక్షిస్తామని వెల్లడించారు.  అధికారంలోకి రాగానే దేశంలో ఉన్న ఒకశాతం అత్యంత ధనికుల నుంచి 5 శాతం సెస్‌ వసూలుచేసి ‘పేదరిక నిర్మూలన నిధి’ ఏర్పాటుచేస్తామన్నారు.

దేశం విసిగిపోయింది: రాహుల్‌
నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనతో దేశం విసిగిపోయిందని.. అందుకే ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఉపాధికల్పన, రైతు సమస్యల పరిష్కారంలో దారుణంగా విఫలమైందన్నారు. ‘కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే దేశాన్ని ఏకం చేసి.. ముందుకు తీసుకెళ్తుంది. అధికార పార్టీ విద్వేషాన్ని రెచ్చగొడుతోంది. కానీ మేం.. సోదరభావాన్ని, ప్రేమను పంచుతాం.అదే మాకు, వారికి ఉన్నతేడా’ అని రాహుల్‌ తెలిపారు. త

న నాయకత్వంలో పార్టీ అనుభవజ్ఞులైన సీనియర్లు, యువరక్తం కలయికతో.. సరికొత్త దిశలో ముందుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మోదీ పాలనలో ఉద్యోగాల్లేక యువకులు దీనంగా ప్రధాని మోదీవైపు చూస్తున్నారు. తమ పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక రైతులు ఆవేదన చెందుతున్నారు. దేశం అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం తీరుతో విసిగి వేసారిపోయింది. అలాంటివారందరికీ మేం సరైన దారిచూపిస్తామని భరోసా ఇస్తున్నా’ అని రాహుల్‌ తెలిపారు. దేశ ప్రజలందరినీ ఏకం చేసి ముందుకు నడిపించే శక్తి తమ పార్టీ గుర్తు ‘హస్తం’కే ఉందన్నారు. ‘హిందుత్వతో హిందూయిజానికి సంబంధం లేదు. బీజేపీకి ఉన్న హిందూ ఓటుకు తలవంచాల్సిన పనిలేదు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌నేత శశిథరూర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


                                        తల్లి సోనియాకు రాహుల్‌ గాంధీ ఆత్మీయ ఆలింగనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement