సాక్షి, హైదరాబాద్: రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రైతుల్ని మోసగించాలని చూస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణలో 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించకపోగా బాధితులను ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని ఓ పండుగలా చేస్తామన్నారు. పెట్టుబడి సాయాన్ని కొనసాగించడంతో పాటు, అన్ని వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో అమలు చేస్తున్నట్లుగానే రైతులకు సహకార బ్యాంకుల ద్వారా రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. భూప్రక్షాళనలో 9లక్షల తప్పులు దొర్లినట్లు సీఎం కేసీఆరే చెప్పారని, ఆ తప్పుల వల్ల చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయం విషయంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో వరుసగా మూడేళ్లు కరువు వచ్చినా ఒక్కసారి కూడా కేంద్రానికి నివేదికలు పంపకపోగా రాష్ట్రం తరఫున ఇవ్వాల్సిన సహాయాన్ని కూడా ఇవ్వలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment