కూసుమంచి/ఖమ్మం సహకారనగర్: ఆదిలాబాద్ జిల్లా మొదలుకొని ఖమ్మం జిల్లా వరకు తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దగ్గరగా చూశారని.. ప్రజలు కూడా తమకు ఏమి కావాలో చెప్పినందున ఆ సమస్యలతోనే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందనుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం భట్టి పాదయాత్ర కొనసాగగా తల్లంపాడులో పాదయాత్ర శిబిరాన్ని పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవితో కలసి రేవంత్ సందర్శించారు.
పలు అంశాలపై గంటకుపైగా చర్చించాక అక్కడే భోజనం చేశారు. ఆ తర్వాత ఖమ్మంలో ఆదివారం జరగనున్న సభ విజయవంతంపై రేవంత్ సమీక్షించారు. అలాగే సభావేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించాక రేవంత్ మీడియాతో మాట్లాడారు. భట్టి చేపట్టిన పాదయాత్ర యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలించిందని చెప్పారు. భవిష్యత్తులో తాము ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, అవసరమైన ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకొనేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పేరిట ప్రజల్లో తీసుకొచి్చన భ్రమలన్నీ భట్టి పాదయాత్రతో పటాపంచలయ్యాయన్నారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని, ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ అన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఇచ్చే సందేశం తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చనుందని, ఈ సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించనున్నామని తెలిపారు.
అంతకుమించి...
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరికతో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని రేవంత్ అన్నారు. తమ పార్టీలో చేరే వారిపై అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని.. అంతా సమన్వయంతో ముందుకెళ్లి అధికారమే లక్ష్యంగా కృషి చేయాలని నేతలకు సూచించారు. ఖమ్మం సభతో బీఆర్‌ఎస్ పాలనకు సమాధి కడతామని జోస్యం చెప్పారు. శ్రీనన్న మూడో కన్ను లాంటి వాడని, శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో.. బీఆర్‌ఎస్ పరిస్థితి కూడా అంతే ఉంటుందన్నారు.
తాజాగా బీజేపీ నేత జితేందర్‌రెడ్డి ట్వీట్ చూస్తే ఆ పార్టీ నాయకులు ఎంత అవమానాలు భరిస్తున్నారో తెలుస్తోందని... బాత్‌రూంకు వెళ్లి ఏడవాల్సిన పరిస్థితి వచ్చిందని రేవంత్ ఎద్దేవా చేశారు. కాగా, బీఆర్‌ఎస్ తొలి సభ కంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ జనగర్జన సభకు అధిక సంఖ్యలో జనం వస్తారని, అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలవడంతోపాటు రాష్ట్రంలో 80కిపైగా సీట్లు దక్కించుకుంటామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సచివాలయానికి రాని కేసీఆర్‌ను ప్రజల బాట పట్టించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని చెప్పారు. ఇప్పుడు ఖమ్మంలో పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతున్నారనే కేసీఆర్ పోడు పట్టాలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వీహెచ్, తెలంగాణ జనగర్జన సభ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.మహే‹Ùకుమార్ గౌడ్‌తోపాటు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. సభ విజయవంతానికి నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను రేవంత్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment