సాక్షి ప్రతినిధి, నల్లగొండ: బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని శిబిరం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పరస్పర విమర్శలు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలసి ఆడుతున్న నాటకంలో భాగమేనని ధ్వజమెత్తారు. ఈ పా ర్టీలు రాష్ట్రంలో ఇతర రాజకీయ పా ర్టీలకు ఉనికి లేకుండా చేయాలని కుట్ర పన్నాయన్నారు. ఆ పా ర్టీల కుట్రలను ఇప్పటికే కాంగ్రెస్ బయటపెట్టిందన్నారు.
బడ్జెట్ సమావేశాలు, జాతీయ జెండా ఆవిష్కరణ వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ గవర్నర్‌తో కలిసి పాల్గొనేందుకు ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు సయోధ్య కుదుర్చుకొని, చిరునవ్వులు నవ్వుతూ గవర్నర్‌తో కలసి పోవడంతో.. కేసీఆర్ గురించి తెలంగాణ సమాజానికి పూర్తిగా అర్థమైందన్నారు. నియంతృత్వ పోకడలతో ఫాసిస్టు పాలన సాగిస్తున్న మోదీ, కేసీఆర్‌లను వదిలించుకుంటే తప్ప తమకు స్వేచ్ఛ ఉండదని ప్రజలు గ్రహించారన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో అంతా అవినీతేనని అన్నారు. ధరణితో భూ కుంభకోణాలు, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు లీజు అక్రమాలు, విలువైన భూముల అమ్మకాల్లో అవినీతి, కాళేశ్వరం అవినీతి, లిక్కర్‌స్కాం చిట్టా తమ వద్ద ఉందని మాట్లాడిన అమిత్‌షా, మోదీలు ఇప్పటివరకు కేసీఆర్‌పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన నాయకులు కేసీఆర్ అసలు స్వరూపం తెలుసుకుని పెద్దఎత్తున మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నారన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టి 3 నెలలు దాటుతోందని, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన గుండె చప్పుడు, వారి ఆవేదనను మీడియా సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నానన్నారు. మీడియా సమావేశంలో నల్లగొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వంగూరి లక్ష్మయ్య, నల్లగొండ ఎంపీపీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment