సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నవంబర్ 30 తరువాత మరో ఉద్యమం రాకుండా ఉండాలంటే, తెలంగాణ నిటారుగా తలెత్తుకుని నిలబడాలంటే.. కల్వకుంట్ల కుటుంబాన్ని బంగాళాఖాతంలో విసిరేయాలని, అందుకు అన్ని వర్గాలు కలిసి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను సాధారణంగా తీసుకోకుండా జీవన్మరణ సమస్యగా భావించాలని కోరారు. నిజాం నిరంకుశత్వం, సమైక్యపాలన వాసనలతో పాలించిన కల్వకుంట్ల కుటుంబంపై దళిత, బలహీన, ఉద్యోగ, నిరుద్యోగ, యువత.. ఇలా అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో రగులుతున్నాయని చెప్పారు.
నవంబర్ 30వ తేదీతో వారి అసంతృప్తి చల్లారుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 45 శాతం ఓట్లతో 82 నుంచి 85 స్థానాల్లో విజయం సాధిస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. హంగ్ ఏర్పడే అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో .. తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమన్నారు. ‘అభయహస్తం’తో డాక్యుమెంట్‌ను ప్రజల ముందు ఉంచామని, సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, సీడబ్లు్యసీ నిర్ణయిస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను ఈసారి అసెంబ్లీ గేటు తాకనివ్వబోమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ప్రజలకు తమ ద్వారాలు తెరిచే ఉంటాయని, ప్రజాదర్బార్‌లు కొనసాగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సాధిక్ ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పలు అంశాలపై వెల్లడించిన అభిప్రాయాలను ఆయన మాటల్లోనే...
మా మేనిఫెస్టోకు రాజముద్ర..
మేము ప్రకటించిన ఆరు గ్యారంటీలకు సీఎం కేసీఆర్ రాజముద్ర వేశారు. మేము ఆరు గ్యారంటీలు ప్రకటించాక అవి సాధ్యం కాదని రెండు నెలల కితం బీఆర్‌ఎస్ ప్రచారం చేసింది. ఆ తరువాత మేము ప్రకటించిన గ్యారంటీల కంటే ఎక్కువే బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పెట్టింది. అంటే మా పథకాలన్నీ అమలు సాధ్యమని అక్కడే తేలింది. కేసీఆర్ అవినీతిని అరికడితే.. మేము ప్రకటించిన పథకాల కంటే ఎక్కువ పథకాలు అమలు చేయొచ్చు.
అవినీతి, అక్రమాలపై న్యాయ విచారణ..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తాం. ప్రాజెక్టులను ఏమి చేయాలన్నది నిపుణులు నిర్ణయిస్తారు. ధరణి పేరుతో ఎన్నో అక్రమాలు చేశారు. అందులోని భాగస్వాములను జైలుకు పంపిస్తాం. ధరణిని రద్దు చేస్తాం. సీఎం హోదాలో కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. హైదరాబాద్ పరిసరాల్లోనే కల్వకుంట్ల కుటుంబం 10 వేల ఎకరాలను అక్రమంగా ఆర్జించింది.
బీసీ, ఎస్సీల ఓట్లు చీల్చేందుకే..
బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించడం వెనుక బలహీనవర్గాల ఓట్లను చీల్చి, కేసీఆర్‌ను సీఎం చేయడమే. ఈసారి 110 సీట్లలో డిపాజిట్లు కోల్పోయే పార్టీ సీఎంని చేస్తామనడం బీసీలను అవమానించడమే. దళితులు, బలహీనవర్గాలు సీఎం కేసీఆర్‌ను ఓడించాలని కసితో ఉన్నారు. ఆ ఓట్లు చీల్చడానికే ఈ బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ నినాదాలు. ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ ఇచ్చి..వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ఆమోదించాలి. అందుకు మందకృష్ణ ఆధ్వర్యంలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధం.
అవసరమైతే ఆస్తులమ్మి అభివృద్ధి.. ప్రభుత్వ ఆదాయంతో సంక్షేమం..
అవసరమైనప్పుడు భూములమ్మి కొత్త ఆస్తులు సృష్టిస్తాం. ప్రభుత్వ ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. బీఆర్‌ఎస్ ఆస్తులు అమ్మి స్నోలు, పౌడర్లకు ఖర్చు చేసింది. అనవసర నిర్మాణాలు చేపట్టం. అలాంటి వాటికి స్వస్తి పలుకుతాం. ప్రాజెక్టుల పై అంచనాలు పెంచి దోచుకున్నారు. రూ.3 యూ నిట్ విద్యుత్‌ను ఇప్పుడు రూ.14కి కొంటున్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా..
ఆయా రా్రష్లాల అవసరాలకు అనుగుణంగా పథకాలు ఉంటాయి. కేసీఆర్ అతి తెలివితో ఇతర రాష్ట్రాల్లో రూ.2 వేల పెన్షన్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో మహాలక్ష్మి పథకం కింద రూ. 2 వేలు, పెన్షన్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మెరుగ్గా ఉన్న పథకాలపై కూడా చర్చకు కేసీఆర్ సిద్ధమైతే మేము సిద్ధం. ఉచిత విద్యుత్‌పై పెటెంట్ కాంగ్రెస్‌దే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి సంతకం ఉచిత విద్యుత్‌పైనే. రూ.1,200 కోట్లు మాఫీ చేశారు. ఇప్పుడు మేము 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 8 నుంచి 10 గంటలు మాత్రమే ఇస్తున్నారు.
అమరవీరుల కోసం కమిషన్..
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసం ఓ కమిషన్‌ను నియమిస్తాం. దీనిని కోదండరామ్ పర్యవేక్షిస్తారు. వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తాం. అందులో పేర్లు నమోదు చేసుకుంటే పరిశీలించి వారందరికీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. టీఎస్‌పీఎస్సీని రద్దు చేస్తాం, మెగా డీఎస్సీ వేస్తాం. ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment