సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, సిద్దిపేట/వనస్థలిపురం/ముషిరాబాద్/దిల్‌సుఖ్‌నగర్: ‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెల్లని నోటు. దానిని జేబులో పెట్టుకుంటే జైలుకు వెళ్లడం ఖాయం’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు దారులను ఓడించాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వవద్దని శపథం చేశానని, కాంగ్రెస్‌ను మోసం చేసిన మహేశ్వరం, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని, దొరలపాలన పోవాలంటే ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో బలిదానాలతో తెలంగాణ వచ్చిందని.. కేసీఆర్ బంగారు తెలంగాణగా మారుస్తాడనుకుంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. విద్యార్థుల బలిదానాలు ఆపాలనే సంకల్పంతో సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్ మాత్రం నిరుద్యోగులు, ఉద్యోగులను వంచిస్తూ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారన్నారు.
గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట, రేణికుంటలో, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన కాంగ్రెస్ ప్రజావిజయభేరి సభల్లో, హైదరాబాద్‌లోని వనస్థలిపురం, ముషీరాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో రేవంత్ ప్రసంగించారు.
ఈటలది నయవంచన..
ఏడుసార్లు హుజూరాబాద్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ నియోజకవర్గ ప్రజలను నయవంచనకు గురి చేశారని రేవంత్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం నయాపైసా తీసుకురాలేని అసమర్థ నాయకుడని దుయ్యబట్టారు. దొంగ ఏడ్పులు ఏడ్చే ఈటల ఏమీ చేయలేదన్నారు.
ఇప్పుడేమో హుజూరాబాద్ ప్రజలను విడిచి గజ్వేల్‌లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ హుజూరాబాద్‌లో కోవర్టులు (పరోక్షంగా పాడి కౌశిక్) పోటీ చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పాడి కౌశిక్ ఎమ్మెల్సీ పదవి, కమీషన్ల కోసం కాంగ్రెస్‌కు ద్రోహం చేశారన్నారు.
పిల్లి తన పిల్లల రక్షణ కోసం ఇల్లిల్లూ మార్చినట్లు.. కేసీఆర్ తాను, తన కుటుంబ సభ్యులకు పదవుల కోసం నియోజకవర్గాలు మారుస్తున్నారని ఎద్దేవాచేశారు. ఉద్యమ సమయంలో సిద్దిపేటలో ఉన్న కేసీఆర్ తర్వాత కరీంనగర్, మహబూబ్‌నగర్, గజ్వేల్‌కు చేరారని, ఇప్పుడు కామారెడ్డికి పారిపోయారన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తాను కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామన్నారు.
చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్‌రూం కట్టిస్తా
రాష్ట్రంలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు కాబోతుందని, కేసీఆర్ రిటైర్ అవుతారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయనకు కూడా పింఛన్ ఇస్తామని, చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తానని చెప్పారు. కేసీఆర్‌తోపాటు ఆయన కొడుకు, బిడ్డ ఉండటానికి కచ్చితంగా ఇల్లు కట్టిస్తానన్నారు. కేసీఆర్ దోచుకున్న రూ.లక్ష కోట్లు కక్కిస్తానని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకే బంగారు తెలంగాణ అయిందని, ప్రజలకు బొందల తెలంగాణగా మారిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్లు ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర పెద్ద జీతగానిలాగా ఉన్నాడని విమర్శించారు. ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు దుబ్బాక అభివృద్ధికి ఏమైనా కృషి చేశారా అని ప్రశ్నించారు. 2018లో ఎల్‌బీనగర్‌లో మీరు సుదీర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని దునుమాడారు. ఎల్‌బీనగర్‌లో మధుయాష్కీగౌడ్‌ను 30 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు.
హైదరాబాద్‌లో పేదలకు ఏ కష్టం వచ్చినా అంజన్‌కుమార్‌యాదవ్ అందుబాటులో ఉంటారని, వరుణ దేవుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అంజన్‌ను ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రణవ్ (హుజూరాబాద్), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), చెరుకు శ్రీనివాస్ రెడ్డి (దుబ్బాక), మధుయాష్కీగౌడ్ (ఎల్‌బీనగర్) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment