G.Chinna reddy
-
రైతులను ఎన్నిసార్లు మోసం చేస్తారు?: చిన్నారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రైతుల్ని మోసగించాలని చూస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణలో 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించకపోగా బాధితులను ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. గాంధీభవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని ఓ పండుగలా చేస్తామన్నారు. పెట్టుబడి సాయాన్ని కొనసాగించడంతో పాటు, అన్ని వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో అమలు చేస్తున్నట్లుగానే రైతులకు సహకార బ్యాంకుల ద్వారా రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. భూప్రక్షాళనలో 9లక్షల తప్పులు దొర్లినట్లు సీఎం కేసీఆరే చెప్పారని, ఆ తప్పుల వల్ల చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయం విషయంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో వరుసగా మూడేళ్లు కరువు వచ్చినా ఒక్కసారి కూడా కేంద్రానికి నివేదికలు పంపకపోగా రాష్ట్రం తరఫున ఇవ్వాల్సిన సహాయాన్ని కూడా ఇవ్వలేదని విమర్శించారు. -
'వైఎస్ఆర్ వల్లే పాలమూరులో ప్రాజెక్టులు ప్రారంభం'
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే పాలమూరులో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిధులు విడుదల చేయడం వల్లే సదరు ప్రాజెక్టులు తుది దశకు చేరుకన్నాయన్నారు. బుధవారం హైదరాబాద్లో చిన్నారెడ్డి మాట్లాడుతూ... ఏడాది కాలంగా కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టులకు రూ. 1000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. రుణమాపీ జరగక, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నారని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రుణమాఫీ అమలు చేసి కొత్తరుణాలు ఇప్పించాలని చిన్నారెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు లేవు కాబట్టి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించాలని వ్యవసాయశాఖకి చిన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు.