'వైఎస్ఆర్ వల్లే పాలమూరులో ప్రాజెక్టులు ప్రారంభం'
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే పాలమూరులో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిధులు విడుదల చేయడం వల్లే సదరు ప్రాజెక్టులు తుది దశకు చేరుకన్నాయన్నారు. బుధవారం హైదరాబాద్లో చిన్నారెడ్డి మాట్లాడుతూ... ఏడాది కాలంగా కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రాజెక్టులకు రూ. 1000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. రుణమాపీ జరగక, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నారని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రుణమాఫీ అమలు చేసి కొత్తరుణాలు ఇప్పించాలని చిన్నారెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు లేవు కాబట్టి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించాలని వ్యవసాయశాఖకి చిన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు.