T Congress MLA
-
ఎందుకిలా జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆ పార్టీ అధిష్టానం పట్టించుకుంటోందా? గత 4–5 నెలలుగా ఒక్కొక్కరుగా చేజారుతున్న ఎమ్మెల్యేల్లో కనీసం ఎవరినైనా పిలిపించి మాట్లాడిందా? వారికి తామున్నామని భరోసా కల్పించే ప్రయత్నం చేసిందా? 12 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లి ఏకంగా పార్టీ శాసనసభాపక్షాన్నే విలీనం చేసినా రాష్ట్ర నాయకత్వానికి ధీమా వచ్చేలా ఏమైనా చర్యలు తీసుకుంటోందా? అంటే లేదనే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. కారణమేదైనా తెలంగాణ కాంగ్రెస్‌ను హైకమాండ్ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హైకమాండ్ వ్యవహార శైలినిబట్టి చూస్తే రాజకీయంగా ఎన్నో ఆశలతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా రెండుసార్లు ఘోర పరాభవాన్ని రుచి చూపించిన రాష్ట్రం విషయంలో చేతులెత్తేసిందా అనే అనుమానం పార్టీ నేతల్లో కలుగుతోంది. నేతల్లో భరోసా కల్పించకపోవడం వల్లే... పార్టీపై భరోసా లేకుండా పోతోందని టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెబుతుంటే మరి భరోసా లేనప్పుడు పార్టీ టికెట్ ఎలా తీసుకున్నారని ప్రశ్నించడమే తప్ప పార్టీలో వారికి అవసరమైన భరోసాను కల్పించడంలో కూడా టీపీసీసీ నాయకత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక నేతల పరిస్థితి ఇలా ఉంటే ఢిల్లీ పెద్దలు కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించకపోవడంతో పార్టీ నుంచి వెళ్లాలనుకునే వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో సమావేశమై అందరిలో భరోసా కల్పిస్తారని చెప్పినా అది జరగలేదు. హైకమాండ్ దృష్టికి వెళ్తున్నాయా..? పార్టీ రాష్ట్రశాఖలో జరుగుతున్న పరిణామాలు హైకమాండ్ దృష్టికి వెళ్లడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేల విషయాన్ని ఆదిలోనే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకమాండ్‌తో రాష్ట్ర పార్టీని సమన్వయం చేయడంలో అధిష్టానంపక్షాన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న ఆర్.సి.కుంతియా విఫలమయ్యారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమైన ఆయన ఎప్పటికప్పుడు హైకమాండ్‌తో టచ్‌లోకి వెళ్లకుండా వ్యవహారాలను నాన్చుతున్నారని అంటున్నారు. ప్రతి విషయంలోనూ ఇదే ధోరణితో ఆయన మొదటి నుంచీ వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర పార్టీ విషయంలో హైకమాండ్‌ను ప్రభావితం చేసే స్థాయిలో సమన్వయం చేయడం లేదనే విమర్శలు కుంతియాపై వస్తున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎపిసోడ్లో ఆయన చొరవ తీసుకోకపోవడం, హైకమాండ్‌కు సకాలంలో చెప్పకపోవడం, టీపీసీసీ నాయకత్వానికి మార్గదర్శనం చేయకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని కొందరు ముఖ్య నేతలు చెబుతున్నారు. ముందే మేలుకొని ఉంటే... వాస్తవానికి ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోశ్, ప్రభాకర్ కాంగ్రెస్ శాసనమండలిపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చిన రోజే టీపీసీసీ నాయకత్వం, ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారి ఉండేది కాదనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. ఒక జాతీయ పార్టీ తరఫున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు పార్టీ అనుమతి లేకుండా సమావేశం కావడం, సీఎల్పీ పేరుతో తీర్మానాలు చేయడం సాంకేతికంగా చెల్లవనే వాదనను బలంగా తీసుకెళ్లడంలో విఫలం కావడం, ఈ ప్రయత్నాన్ని ఎదుర్కొనే క్రమంలో కనీస పట్టుదల లోపించడంతో ఇప్పుడు అసెంబ్లీలో వెనుక బెంచీల్లో కూర్చోవాల్సి వస్తోందని పార్టీ నేతలు వాపోతున్నారు. మండలి సభ్యులు చేసిన తీర్మానంపై పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం ఈ పరిణామాన్ని ఢిల్లీ వరకు తమ పార్టీ నేతలు తీసుకెళ్లారో కూడా అర్థం కాలేదని, అదే జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పడుతోంది. పార్టీలో ఏం జరిగినా హైకమాండ్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని ఆయన వాపోయారు. ఇప్పుడు పార్టీ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మరో పార్టీలోకి వెళ్లినా కనీసం పట్టించుకోలేదని, ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమేనని, హైకమాండ్ వెంటనే తాజా పరిణామాలపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఎమ్మెల్యేల పై అనర్హతా వేటు వేయాలి
-
'మెదక్ జిల్లాకు హరీశ్ అన్యాయం చేస్తున్నారు'
హైదరాబాద్ : మెదక్ జిల్లాకు హరీశ్‌రావు అన్యాయం చేస్తున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో టి.జీవన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా హరీశ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు కట్టాలనే చిత్తశుద్ధి ఉంటే రిజిస్ట్రేషన్ విలువ పెంచి నిర్వాసితులకు చెల్లింపులు జరపాలని ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'231 కరవు మండలాలను మాత్రమే గుర్తించింది'
హైదరాబాద్ : గతేడాది సెప్టెంబర్‌లోపే రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించి ఉంటే బావుండేదని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో 433 కరువు మండలాలు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 231 కరవు మండలాలను మాత్రమే గుర్తించిందని ఆయన చెప్పారు. సరైన సమయంలో కరువు మండలాలను గుర్తిస్తే కేంద్రం సాయం పొందే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి టి.జీవన్‌రెడ్డి సూచించారు. -
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
మహబూబ్‌నగర్ : తన సోదరుడు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిపై దాడి చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జి బాలరాజుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రభుత్వానికి సూచించారు. శనివారం మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కులం పేరుతో దాడికి దిగడం తగదని డీకే అరుణ అన్నారు. ఇలాంటి వ్యక్తులతో బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారో ఆలోచించాలని కేసీఆర్‌కు డీకే అరుణ హితవు పలికారు. -
అప్పుడు పాపాలు గుర్తుకు రాలేదా ?
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత విమర్శలను కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఖండించారు. ఎన్డీఏకి దగ్గర కావాలనే ప్రయత్నంలో భాగంగానే ఎంపీ కవిత... రాహుల్‌ను విమర్శిస్తున్నారని శనివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. పాపాలు కడుకొనేందుకు రాహుల్ పుష్కర స్నానాలు చేయాలనడం కవిత అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పినప్పుడు పాపాలు గుర్తుకు రాలేదా అంటూ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో వెయ్యి మంది రైతుల ఆత్మహత్యల పాపం అధికార టీఆర్ఎస్దే అని స్పష్టం చేశారు. సదరు రైతు కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్...అందులో రైతుల వాటా ఎంతో చెప్పాలని జీవన్‌రెడ్డి అన్నారు. -
'తప్పులు కప్పిపుచ్చుకునేందుకే డ్రామాలు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ విచారణపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ఏసీబీ విచారణపై ఆ పార్టీ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ఎందుకు విచారించడం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఎవరు వారధిగా వ్యవహరిస్తున్నారని జీవన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో పెద్దవారిని వదిలేసి చిన్నవారిని ఎందుకు విచారిస్తున్నారంటూ జీవన్ రెడ్డి... ఏసీబీని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రోకోనే అని ఆయన స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఏసీబీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదనే భావన ప్రజల్లో కనబడుతుందని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
'వైఎస్ఆర్ వల్లే పాలమూరులో ప్రాజెక్టులు ప్రారంభం'
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే పాలమూరులో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిధులు విడుదల చేయడం వల్లే సదరు ప్రాజెక్టులు తుది దశకు చేరుకన్నాయన్నారు. బుధవారం హైదరాబాద్‌లో చిన్నారెడ్డి మాట్లాడుతూ... ఏడాది కాలంగా కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టులకు రూ. 1000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. రుణమాపీ జరగక, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నారని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రుణమాఫీ అమలు చేసి కొత్తరుణాలు ఇప్పించాలని చిన్నారెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు లేవు కాబట్టి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించాలని వ్యవసాయశాఖకి చిన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
'ఫాంహౌస్ లో పంట సాగుపైనే కేసీఆర్ దృష్టి'
హైదరాబాద్: రాష్ట్రంలో రైతాంగ సమస్యలను నిర్లక్ష్యం చేసి... సొంత ఫాంహౌస్‌లో పంటల సాగుపైనే సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. రైతులు, వారి సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై శనివారం హైదరాబాద్‌లో జీవన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు కావాల్సిన పెట్టుబడులు, ఎరువుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ఏడాది రుణమాఫీని ఒకే విడతలో చెల్లించి... రైతులకు కొత్త రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్.. రైతులకు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఉద్యానవన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని సభలో ప్రకటిచిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం... వాటిని ఇంకా చెల్లించకపోవడం ఓ విధంగా సభా హక్కుల ఉల్లంఘనే అని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజాం షుగర్స్‌కు వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
కేసీఆర్ మెతక వైకరివల్లే...
-
కేసీఆర్ మెతక వైఖరి వల్లే ...
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెతక వైఖరి వల్లే ఓటుకు కోట్లు కేసు నీరుగారుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్‌లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులను ఆంధ్రప్రదేశ్‌లో ఫైల్ చేస్తే అవి చెల్లవన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఆ ఫిర్యాదు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ పోలీసులకే ఫిర్యాదు చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాలు, సూచనల మేరకే గవర్నర్ వ్యవహరిస్తారని జీవన్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల బాధ్యత పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు సెక్షన్ -8లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. -
కేసీఆర్ మారు వేషంలో వెళ్లి చూడు..
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ శనివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఎంతగా విసిగిపోయారో తెలియాలంటే మారు వేషంలో వారి మధ్యకు వెళ్లాలని ఆమె కేసీఆర్‌కు సూచించారు. సీఎంగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు చూసి దేశం నవ్వుతోందని ఆమె ఎద్దేవా చేశారు. రాజ్యాంగ స్పూర్తిని కేసీఆర్ మరిచిపోయి నిర్ణయాలు తీసుకుంటున్నారని డీ కే అరుణ విమర్శించారు. కోర్టు మోట్టికాయలు వేస్తున్నా సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవడం లేదన్నారు. ఇతర పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి... మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే... పార్టీకి ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందో తెలుస్తుందన్నారు. మిషన్ కాకతీయ పథకం నీరు కారి పోతుందని డీ కే అరుణ అన్నారు. -
'కేసీఆర్ ప్రభుత్వం నాపై కక్ష సాధిస్తోంది'
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. అందులోభాగంగానే అసెంబ్లీలో తనను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద డీకే అరుణ మాట్లాడుతూ... మైనింగ్ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుందని... ఈ నేపథ్యంలో మైనింగ్ అంశాన్ని సభలో లేవనెత్తడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. తనపై విప్ సునీత అనవరస వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఈ సందర్బంగా అరుణ విజ్ఞప్తి చేశారు. -
'కేసీఆర్ మనవడి తరంలో కూడా అమలు కాదు'
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలుకు హామీలు ఇచ్చి... ఆపై ఎన్నికల్లో విజయం సాధించి సీఎం పీఠం అధిష్టించిన కేసీఆర్‌పై టీ కాంగ్రెస్ నాయకుడు, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని కేసీఆర్ సర్కార్ విస్మరిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇలా మొక్కుబడిగా ఈ పథకాన్ని అమలు చేస్తే... కేసీఆర్ కాదు గదా ఆయన మనువడి తరంలో కూడా కేజీ టూ పీజీ హామీ అమలు కాదని ఎద్దేవా చేశారు. విద్య హక్కు చట్టాన్ని కూడా కేసీఆర్ నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఇలా అయితే బంగారు తెలంగాణ సాధ్యం కాదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. -
కేసీఆర్ పర్యటన అంతా ఒట్టి షో
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో తనదైన శైలిలో వ్యంగ బాణాలు సంధించారు. సీఎం కేసీఆర్‌ను చూసి సమస్యలు పారిపోవడం లేదని, వాటిని చూసీ కేసీఆరే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యలు తదితర సమస్యలపై కేసీఆర్‌కు అవగాహన లేదని ఆరోపించారు. సీఎం పాలనపై ఉద్యమం సమయంలో ఆయనతో ఉద్యమించిన వారే ఇప్పుడు కేసీఆర్‌ను నిలదీస్తున్నారని తెలిపారు. వరంగల్‌లో కేసీఆర్ పర్యటన అంతా ఒట్టి నాటకమని అన్నారు. కేసీఆర్ ఆలోచనలు అన్నీ గాలిలో వేలాడుతున్నాయని... అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపిస్తున్నారని టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. -
'స్వైన్ ఫ్లూ' విజృంభిస్తున్నా ... పట్టించుకోవడం లేదు
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో షబ్బీర్ అలీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... స్వైన్ ఫ్లూతో తెలంగాణలో ఇప్పటికి 17 మంది చనిపోగా... 100 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. సీఎం కేసీఆర్ మాత్రం వ్యాధులు, ప్రజా ఆరోగ్య పరిస్థితిని ఇప్పటి వరకు సమీక్షించలేదని విమర్శించారు. ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల్లో జోక్యం చేసుకోవాలని షబ్బీర్ అలీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంసెట్ నిర్వహణ అవకాశాన్ని తెలంగాణకే ఇవ్వాలని ఆయన కేంద్రానికి సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఫాస్ట్ పథకం నత్తనడకన సాగుతోందని షబ్బీర్ అలీ చెప్పారు. -
డబుల్ బెడ్ రూం ప్లాట్‌కు రూ. లక్షా ?
హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు షరతుల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మంగళవారం హైదరాబాద్‌లో ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ. లక్ష కట్టాలని షరతు విధించటం సరికాదన్నారు. పేదలు రూ. లక్ష కట్టలేకపోతే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేయరా అని ఆమె కేసీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ పధకాన్ని ఆటకెక్కించే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ విధంగా షరతులు విధిస్తోందని డీకే అరుణ అరోపించారు. కాంగ్రెస్ హయాంలో మంజూరైన బిల్లులను కూడా పెండింగ్‌లో పెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వాణిజ్యపన్నుల శాఖ మంత్రి టి.శ్రీనివాసయాదవ్ తన రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని ఆయనకు హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఒరవడి ఉండాలంటున్న సీఎం కేసీఆర్... తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదింప చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ఆయనకు డీకే అరుణ హితవు పలికారు. -
డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలి
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం టి.రాజయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో రాజయ్య... సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం రాజయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా జరిగిన బలిదానాలకు సోనియాగాంధీయే కారణమని రాజయ్య శనివారం అసెంబ్లీలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్‌పై విధంగా స్పందించారు.