'ఫాంహౌస్ లో పంట సాగుపైనే కేసీఆర్ దృష్టి'
హైదరాబాద్: రాష్ట్రంలో రైతాంగ సమస్యలను నిర్లక్ష్యం చేసి... సొంత ఫాంహౌస్లో పంటల సాగుపైనే సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆరోపించారు. రైతులు, వారి సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై శనివారం హైదరాబాద్లో జీవన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు కావాల్సిన పెట్టుబడులు, ఎరువుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ఏడాది రుణమాఫీని ఒకే విడతలో చెల్లించి... రైతులకు కొత్త రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్.. రైతులకు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఉద్యానవన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని సభలో ప్రకటిచిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం... వాటిని ఇంకా చెల్లించకపోవడం ఓ విధంగా సభా హక్కుల ఉల్లంఘనే అని జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజాం షుగర్స్కు వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి జీవన్రెడ్డి విజ్ఞప్తి చేశారు.