
కేసీఆర్ మారు వేషంలో వెళ్లి చూడు..
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ శనివారం హైదరాబాద్లో ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఎంతగా విసిగిపోయారో తెలియాలంటే మారు వేషంలో వారి మధ్యకు వెళ్లాలని ఆమె కేసీఆర్కు సూచించారు. సీఎంగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు చూసి దేశం నవ్వుతోందని ఆమె ఎద్దేవా చేశారు.
రాజ్యాంగ స్పూర్తిని కేసీఆర్ మరిచిపోయి నిర్ణయాలు తీసుకుంటున్నారని డీ కే అరుణ విమర్శించారు. కోర్టు మోట్టికాయలు వేస్తున్నా సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవడం లేదన్నారు. ఇతర పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి... మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే... పార్టీకి ప్రజల్లో ఎంత విశ్వాసం ఉందో తెలుస్తుందన్నారు. మిషన్ కాకతీయ పథకం నీరు కారి పోతుందని డీ కే అరుణ అన్నారు.