సాక్షి, నారాయణపేట: రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను సీఎం కేసీఆర్ ఎందుకు కలవలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తన ఫాం హౌస్‌లో పండించిన పంట ఎవరికి అమ్మారో సమాధానం చెప్పాలన్నారు. నాగార్జునసాగర్‌లో కూడా బీజేపీ గెలుస్తుందని, ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లు, అచ్చంపేట మున్సిపాలిటీ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ అరాచక, అవినీతిపాలన అంతమయ్యేవరకు పోరాడతామన్నారు. తెలంగాణలో అవకాశం వస్తే సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, అమరవీరుల ఆశయాలను తుంగలో తొక్కిన సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్ర మంత్రులకు సీఎం వద్ద అపాయిమెంట్ లేదు కానీ, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులను లక్షాధికారులను చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చామని, దేశం కోసం పోరాటం, త్యాగాలు చేసేది బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు.
అవినీతిలో టీఆర్‌ఎస్: డీకే అరుణ..
సైనికుల్లా యువత బీజేపీని ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సీఎం కేసీఆర్ అబద్ధాల కోరు అని విమర్శించారు. రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర పథకాలపై రైతుల్లో టీఆర్ఎస్ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో జూరాల నుంచి నారాయణపేటకు సాగునీరు తీసుకొచ్చి పొలాలను సస్యశ్యామలం చేస్తామని డీకే అరుణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment