పాతవాటికే పైసా ఇవ్వలేదు.. కొత్తవాటికి ఏమిస్తారు? | DK Aruna Comments On CM KCR | Sakshi
Sakshi News home page

పాతవాటికే పైసా ఇవ్వలేదు.. కొత్తవాటికి ఏమిస్తారు?

Published Sat, Jul 20 2019 3:01 AM | Last Updated on Sat, Jul 20 2019 3:01 AM

DK Aruna Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 68 పాత మున్సిపాలిటీలకే ఐదేళ్లలో పైసా ఇవ్వలేదని, అవన్నీ కేంద్ర నిధులతోనే నెట్టుకొస్తున్నాయని, ఇపుడు కొత్త మున్సిపాలిటీలకు ఏం ఇస్తారని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినందుకే నిధులు ఇస్తామని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కలెక్టర్లకు మున్సిపాలిటీలపై అధికారాలను అప్పగించి వాటిని నిర్వీర్యం చేసే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.

కలెక్టర్లకు విశేష అధికారాలిచ్చి, వారి ఆమోదం లేకుండా మున్సిపాలిటీలకు పనులను చేయవద్దని, అలా కాదని చేస్తే తొలగించేలా నిబంధనలను పెట్టడం మున్సిపాలిటీలను దెబ్బతీయడమేనన్నారు. వార్డులలో గెలిచిన కౌన్సిలర్లు తమ ప్రజలకు ఏం కావాలో నిర్ణయం తీసుకునే అధికారం లేకుండా చేశారని విమర్శించారు. చెట్లు ఉండకపోతే సర్పంచులను బాధ్యులను చేస్తామని, తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వారిని తొలగించడం కాదని, రాష్ట్రా నికి సీఎం కేసీఆర్‌ కాబట్టి ఏదైనా ఫెయిలైతే ఆయన్నే తొలగించాలని పేర్కొన్నారు. ఆయన్ని ఎవరు తొలగించాలో చెప్పాల న్నారు. పెంచిన పెన్షన్లు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. ప్రొసీడింగ్స్‌ కాదని, డబ్బులు వేయాలని అన్నారు.  

రైతుల ఆందోళనలో ఉన్నా సమీక్ష లేదు 
రాష్ట్రంలో వర్షాలు లేవని, విత్తనాలు మొలకెత్తలేదని, ఈ పరిస్థితుల్లో రైతులు ఆందోళనలో ఉన్నా.. సీఎం ఒక్క సమీక్షా చేయలేదని విమర్శించారు. ఆయనకు మున్సిపల్‌ ఎన్నికలే ప్రాధాన్య అంశం అయ్యాయని దుయ్యబట్టారు. ప్రధానిని చూస్తే సీఎంకు భయం వేస్తోందని ఎద్దేవా చేశారు. మోదీ గెలుపు ఓ గెలుపేనా అని కేసీఆర్‌ వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. మోదీ, అమిత్‌ షా తెలంగాణపై దృష్టి పెట్టడాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్‌ హడావుడిగా మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు.

జిల్లా యంత్రాంగాన్ని తమ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎవరైనా టీఆర్‌ఎస్‌ నేతలు వేధిస్తున్నారని పోలీస్‌ స్టేషన్‌కు వెళితే వారే టీఆర్‌ఎస్‌లో చేరమని సలహా ఇస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి నెలకొందో అర్థం చేసుకోవాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఒక జిల్లా కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌లో చేరమని తనకే చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ చిట్టా విప్పుతున్నామని, అవసరమైన కేసులు వేస్తామని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement