
'తప్పులు కప్పిపుచ్చుకునేందుకే డ్రామాలు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ విచారణపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ఏసీబీ విచారణపై ఆ పార్టీ ఎమ్మెల్యే టి. జీవన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ఎందుకు విచారించడం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఎవరు వారధిగా వ్యవహరిస్తున్నారని జీవన్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో పెద్దవారిని వదిలేసి చిన్నవారిని ఎందుకు విచారిస్తున్నారంటూ జీవన్ రెడ్డి... ఏసీబీని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రోకోనే అని ఆయన స్పష్టం చేశారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఏసీబీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదనే భావన ప్రజల్లో కనబడుతుందని జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు.