'స్వైన్ ఫ్లూ' విజృంభిస్తున్నా ... పట్టించుకోవడం లేదు
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... స్వైన్ ఫ్లూతో తెలంగాణలో ఇప్పటికి 17 మంది చనిపోగా... 100 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. సీఎం కేసీఆర్ మాత్రం వ్యాధులు, ప్రజా ఆరోగ్య పరిస్థితిని ఇప్పటి వరకు సమీక్షించలేదని విమర్శించారు.
ఎంసెట్ నిర్వహణపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల్లో జోక్యం చేసుకోవాలని షబ్బీర్ అలీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంసెట్ నిర్వహణ అవకాశాన్ని తెలంగాణకే ఇవ్వాలని ఆయన కేంద్రానికి సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఫాస్ట్ పథకం నత్తనడకన సాగుతోందని షబ్బీర్ అలీ చెప్పారు.