సిరిసిల్ల బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కేశవరావు, కేటీఆర్, గంగుల కమలాకర్
సిరిసిల్ల: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టాయని మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు చెప్పారు. కాంగ్రెస్ కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలనే కొనసాగింపుగా మేనిఫెస్టోలో పెట్టిందని, నఖల్ కొట్టేందుకు కూడా వాళ్లకు అఖల్ లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు మేనిఫెస్టో అంటే.. ఖురాన్, బైబిల్, భగవద్గీత లాంటివన్నారు.
హామీ ఇచ్చిన వాటిలో 90% పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ కార్యాలయ భవనాన్ని ఆయన పార్టీ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ మేనిఫెస్టో చూశాక కాంగ్రెస్, బీజేపీ నాయకులు దుప్పటి కప్పుకున్నారని ఎద్దేవా చేశారు. గతంలోనూ కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటించినా ప్రజలు నమ్మలేదని, సీఎం కేసీఆర్‌ను తిడితే ఓట్లు రావని పేర్కొన్నారు. ఆయ న కంటే ఎక్కువగా, మరింత చిత్తశుద్ధితో తెలంగాణను ప్రేమిస్తేనే ఓట్లు వస్తాయని హితవు పలికారు. సిలిండర్‌ను, ప్రధాని మోదీని తలచుకుని బీజేపీ అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు చేయాలని కోరారు.
బీమా పథకం ఎంతో తృప్తినిచ్చింది
రాష్ట్రంలో రైతుల రుణమాఫీ త్వరలోనే పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రూ.20 వేల కోట్లు రుణమాఫీకి అవసరం ఉండగా.. ఇప్పటికే రూ.13,300 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని, మిగతా రూ.6,700 కోట్లు త్వరలోనే మాఫీ అవుతాయన్నారు. మహారాష్ట్ర నేతలు మన ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ వస్తే.. చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ బీమా పథకం ఎంతో తృప్తినిచ్చిందని, తెల్లకార్డుదారులైన 93 లక్షల కుటుంబాలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఎల్‌ఐసీ ద్వారా బీమా కల్పిస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ బీఆర్‌ఎస్ కార్యాలయాలను నిర్మిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
మేనిఫెస్టోపై చర్చ జరగాలి: కేశవరావు
మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, చర్చ జరిగేలా చూడాలని బీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు చెప్పారు. సీఎం కేసీఆర్ అంకితభావంతో చిత్తశుద్ధితో పనిచేస్తారన్నారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment